ఆ మలుపును తలచుకుంటేనే భయం
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:26 PM
పల్లిసారథి- రిట్టపాడు గ్రామాల మధ్య చెరువు గట్టుకు పక్కనే ఉన్న బీటీ రోడ్డు మలుపు వద్ద నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పల్లిసారథి- రిట్టపాడు గ్రామాల మధ్య చెరువు గట్టుకు పక్కనే ఉన్న బీటీ రోడ్డు మలుపు వద్ద నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిత్యం ఎవరో ఒకరు క్షతగాత్రులతున్నారు. చెరువు గట్టుకు ఆనుకొని రోడ్డు ఉండడం... గొల్లసారఽథి గ్రామానికి వెళ్లే జంక్షన్ కావడంతో పాటు రోడ్డు మలుపు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. మలుపు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నా ఫలితం ఉండడం లేదని ఈ ప్రాంతీయులు ఆరోపిస్తున్నారు. కాశీబుగ్గ మార్కెట్‌కు దగ్గరి దారి కావడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే స్కూల్ బస్సులు, ఇతర భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెరువు గట్టు మలుపువద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
ప్రమాదాలు ఇలా...
ఇటీవల రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు గాయాలపాయ్యారు. కొద్ది రోజుల కిందట మలుపు వద్ద ఓ స్కూల్ బస్సును తప్పించబోయిన ఆటో పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఉన్న కొంతమంది వచ్చి ఆటో బోల్తా పడకుండా నివారించగలిగారు. రెండు నెలల క్రితం పనస కాయల లోడుతో వెళుతున్న ఆటోను ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాశీబుగ్గలోని ప్రైవేటు ఆసుపత్రిలో 10 రోజులు పాటు చికిత్స పొందాల్సి వచ్చింది. ఇలా తరచూ ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువ మంది ప్రమాదాల్లో గాయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.