మార్కులు తక్కువ వచ్చాయని..
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:15 AM
Inter student commits suicide ఇంటర్ మొదటి సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపానికి గురైన విద్యార్థి క్లాస్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం పరిధి ఆనందపురం మండలం పెద్దిపాలెంలో గురువారం చోటుచేసుకుంది.
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
జె.బైరిపురంలో విషాదఛాయలు
కంచిలి/విశాఖపట్నం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ఇంటర్ మొదటి సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపానికి గురైన విద్యార్థి క్లాస్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం పరిధి ఆనందపురం మండలం పెద్దిపాలెంలో గురువారం చోటుచేసుకుంది. సీఐ చింతా వాసునాయుడు తెలిపిన వివరాలివి... శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జె.బైరిపురం గ్రామానికి చెందిన లోకినిండి తారకేష్(18) పెద్దిపాలెంలోని శ్రీభవిష్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాల్లో తారకరావుకు 441 మార్కులు వచ్చాయి. దీనిపై తోటి విద్యార్థులు, తల్లిదండ్రులతో తనకు ఇంకా ఎక్కువ మార్కులు రావాల్సి ఉందని, బాగా తక్కువ వచ్చాయని ఆవేదనతో చెప్పాడు. అదే విషయమై తీవ్ర మనస్తాపానికి గురై గురువారం తెల్లవారుజామున క్లాస్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది తండ్రి భాగీరావుకు సమాచారం అందించారు. సీఐ వాసునాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. తారకేష్ తండ్రి బాగీరావు.. చెన్నైలో వలస కూలీగా పనిచేస్తున్నారు. తల్లి లలిత గృహిణి. తొమ్మిదో తరగతి చదువుతున్న సోదరుడు ఉన్నాడు. తారకేష్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని కుటుంబ సభ్యులంతా విలపించారు. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.