Share News

ఎత్తిపోతలు పనిచేయట్లే!

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:21 AM

Projects not works ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సాగునీటి వనరులు సరిగ్గా వినియోగానికి నోచుకోవడం లేదు. బాహుదా, మహేంద్రతనయా నదుల పరిధిలో చెక్‌డ్యామ్‌లు, గ్రోయిన్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఎత్తిపోతలు పనిచేయట్లే!
మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకం

  • మూలకు చేరిన ప్రాజెక్టులు

  • ఏళ్ల తరబడి ప్రతిపాదనలతో సరి

  • రైతులకు తప్పని సాగు కష్టాలు

  • ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సాగునీటి వనరులు సరిగ్గా వినియోగానికి నోచుకోవడం లేదు. బాహుదా, మహేంద్రతనయా నదుల పరిధిలో చెక్‌డ్యామ్‌లు, గ్రోయిన్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరోవైపు ఎత్తిపోతల పథకాలు పనిచేయడం లేదు. దీంతో రైతులకు ఏటా ఖరీఫ్‌లో సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. వంశధార నీటిని తెస్తారని రైతులు ఆశగా ఎదురుచూసినా, కనీస కార్యాచరణ లేకపోవడం బాధాకరం.

  • ఎనిమిదేళ్లుగా మూలకు..

  • ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ఎత్తిపోతల పథకం ఎనిమిదేళ్ల కిందట మూలకు చేరింది. దీనిని ఆధునికీకరిస్తే ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. బాహుదా నది ఆధారంగా ఈదుపురం వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకంతో ఆయకట్టు మొత్తానికి సాగునీరు పుష్కలంగా అందేది. కానీ వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో ఈ పథకం మూలన చేరింది. రెండు పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా మరమ్మతులు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నాళ్ల కిందట సీఎం చంద్రబాబు ఈదుపురం పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎత్తిపోతల పథకం పునరుద్ధరణకు రూ.2కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాలేదు. ఎత్తిపోతల పథకం మరమ్మతులు జరగలేదు.

  • బీల ఎత్తిపోతలూ అదే పరిస్థితి..

  • ఏడాది పొడవునా బీలబట్టిలో నీటిలభ్యత ఉండడంతో సోంపేట మండలం రుషికుద్ద, బెంకిలి, కంచిలి మండలం కుత్తుమలో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా 2వేల ఎకరాలకు సాగునీరు అందేది. ఖరీఫ్‌, రబీతోపాటు ఏడాది పొడవునా కూరగాయల సాగుతో రైతులు ఉపాధి పొందేవారు. తితలీ తుఫాన్‌ సమయంలో ఈ ఎత్తిపోతల పథకాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పరికరాలతోపాటు పైపులైన్లు పూర్తిగా పాడయ్యాయి. వైసీపీ హయాంలో ప్రతిపాదనలైతే పంపారు కానీ పైసా కూడా మంజూరు కాలేదు. ఫలితంగా ఈ ప్రాంత రైతులు వర్షాధారంతో ఖరీఫ్‌ సాగుకే పరిమితం అవుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతల పథకాల మరమ్మతులపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

  • ఇబ్బందిపడుతున్నాం..

  • సాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో గ్రామంలో ఎత్తిపోతల పథకం ద్వారా పుష్కలంగా సాగునీరు అందేది. కానీ నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. ఖరీఫ్‌లో శివారు ఆయకట్టుకు నీరు అందదు. రబీలో నదిలో నీటి లభ్యత లేక పనిచేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

  • - బోర సాంబమూర్తి, రైతు, ఈదుపురం

  • తక్షణమే పనులు చేయాలి

  • కొన్నాళ్ల కిందట ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.2కోట్లు మంజూరు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇంతవరకూ పనులు ప్రారంభించలేదు. తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలి.

  • - దువ్వు మోహన్‌రావు, రైతు, ఈదుపురం

Updated Date - Apr 27 , 2026 | 12:21 AM