ఆరిన ఆశల దీపం
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:15 AM
ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. ఉన్నత చదువులు చదవాలనుకున్న ఆ బాలిక కలలు కల్లలయ్యాయి.
- పాఠశాల భవనం నుంచి జారిపడి విద్యార్థిని మృతి
- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
పాతపట్నం/కోటబొమ్మాళి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. ఉన్నత చదువులు చదవాలనుకున్న ఆ బాలిక కలలు కల్లలయ్యాయి. పాఠశాల పైఅంతస్తు నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ఘటన పాతపట్నంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది వివరాల మేరకు.. కోటబొమ్మాళి పంచాయతీ హడ్కోకాలనీకి చెందిన చింతల సింహాద్రి, కొత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె పూజిత(12) పాతపట్నంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం భోజనాల కోసం పూజిత పాఠశాల మూడో అంతస్తు నుంచి కిందకు దిగుతుండగా మెట్ల రైలింగ్ వద్ద నుంచి జారి పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన పూజితను స్థానిక 50 పడకల సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తహసీల్దార్ నందిగామ ప్రసాదరావు సమక్షంలో రెవెన్యూ అధికారులు శవపంచానామా నిర్వహించారు. పూజిత తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనాస్థలానికి, హాస్పిటల్ వద్దకు డీసీవో యశోద లక్ష్మి, ఎంఈవో గోవిందరావు తదితరులు చేరుకొని వివరాలు సేకరించారు. కాగా గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్య కారణంగానే తమ కుమార్తె మృతి చెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూజిత తండ్రి సింహాద్రి కారు డ్రైవర్ కాగా, తల్లి కోటమ్మ గృహిణి. కుమార్తె మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.