Share News

‘కిక్‌’ తగ్గింది!

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:38 AM

Lukewarm response to liquor shop renewals జిల్లాలో మద్యం షాపుల రెన్యువల్‌కు కొంతమంది వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. గత వారం రోజుల నుంచి ఎక్సైజ్‌ అధికారులు ఎంత నచ్చజెబుతున్నా.. రెన్యువల్‌పై ఆశించినస్థాయిలో స్పందన కనిపించడం లేదు.

‘కిక్‌’ తగ్గింది!

  • మద్యం షాపుల రెన్యువల్‌కు అరకొర స్పందన

  • జిల్లాలో 120 షాపులకు మాత్రమే లైసెన్స్‌ పునరుద్ధరణ

  • మిగిలిన వాటికి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి):

  • హిరమండలం, కొత్తూరు మండలాలకు సంబంధించి 9 మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో మూడు షాపులు మాత్రమే రెన్యువల్‌ అయ్యాయి.

  • టెక్కలి, మెళియాపుట్టి మండలాలకు సంబంధించి 13 మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో ఏడు షాపుల యాజమానులు మాత్రమే రెన్యువల్‌ కోసం డబ్బులు చెల్లించారు.

  • జిల్లాలో మద్యం షాపుల రెన్యువల్‌కు కొంతమంది వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. గత వారం రోజుల నుంచి ఎక్సైజ్‌ అధికారులు ఎంత నచ్చజెబుతున్నా.. రెన్యువల్‌పై ఆశించినస్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఒకప్పుడు మద్యం షాపు లైసెన్స్‌ దక్కడం అదృష్టంగా భావించేవారు. కానీ ప్రస్తుతం ఆ ‘కిక్‌’ లేదు. కూటమి ప్రభుత్వం బెల్ట్‌షాపులతోపాటు అధిక ధరలకు మద్యం విక్రయాలను కట్టడి చేసింది. మరోవైపు భారీ ఫీజులు, పెరిగిన నిర్వహణ ఖర్చులు.. జరిమానాలు, సీజ్‌ల కారణంగా మద్యం షాపుల నిర్వాహకులు రెన్యువల్‌కు వెనుకంజ వేస్తున్నారు.

  • జిల్లాలో 176 మద్యం దుకాణాలు, 19 బార్లు ఉన్నాయి. మద్యం షాపుల ద్వారా వార్షిక ఆదాయం రూ.117.60 కోట్లు రాగా.. బార్లు ద్వారా రూ.9.10 కోట్లు వరకు వస్తుంది. ప్రస్తుతం మద్యంషాపుల లైసెన్స్‌ల గడువు ముగిసింది. మరో ఏడాదిపాటు వీటిని రెన్యువల్‌ చేసేందుకు ఈ నెల 12న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. రెన్యువల్‌కు 38శాతం అదనపు ఆర్‌ఈటీ, లైసెన్స్‌ రూపంలో 1/4 శాతం, పర్మిట్‌ రూమ్‌ రుసుంలో 1/3 వంతు, రూ.5వేల ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో ఈ నెల 21వ తేదీలోగా రెన్యువల్‌ చేసుకోవాలని మద్యం వ్యాపారులకు సూచించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రంతో గడువు ముగియగా.. ఇప్పటివరకూ 120 మంది వ్యాపారులు మాత్రమే మద్యం షాపుల రెన్యువల్‌కు డబ్బులు చెల్లించారు. ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కొంతమంది వ్యాపారులు రెన్యువల్‌కు ముందుకు రాకపోవడంతో.. ఎక్సైజ్‌ అధికారులు అయోమయం చెందుతున్నారు. కొంతమంది మద్యం వ్యాపారులు రెన్యువల్‌ కోసం అధికారుల వద్ద కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. ‘భవిష్యత్‌లో మీరు మద్యం విక్రయాలకు అడ్డురాకుండా.. దాడులు లేకుండా చూస్తామని భరోసా ఇవ్వాలి. బెల్ట్‌షాపుల నిర్వహణతోపాటు సీసాపై కనీసం రూ.10 అయినా అదనంగా తీసుకోవడానికి అవకాశం ఇవ్వాల’ని కోరుతున్నారు.

  • నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • ‘జిల్లాలో అధికంగా మద్యం షాపుల రెన్యువల్‌ కోసం ప్రయత్నించాం. రెన్యువల్‌ కాని మద్యం షాపులకు మంగళవారం నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నామ’ని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ తిరుపతినాయుడు తెలిపారు. ‘ఒక్కో షాపునకు దరఖాస్తు ఫీజు రూ.3.లక్షలు. ఒక్కో షాపునకు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీకి ఆమోదిస్తాం. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్నామ’ని తిరుపతినాయుడు తెలిపారు.

Updated Date - Sep 22 , 2026 | 12:38 AM