Share News

బిడ్డ పుట్టిన ఆనందం.. క్షణాల్లోనే విషాదం

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:15 AM

Wife delivers baby in hospital; husband dies in road accident మృత్యువు ఏ రోజు.. ఏ రూపంలో వస్తుందో తెలియదనడానికి ఆ ఘటనే ఉదాహరణ. ప్రసవ వేదనతో బాధపడుతున్న భార్యను ఆటోలో ఆస్పత్రికి తెచ్చాడు భర్త. అక్కడ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది భార్య. తమ ఇంట రెండో సంతానంగా లక్ష్మీదేవి పుట్టిందని ఆ దంపతులు మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం ఎంతసేపూ మిగల్లేదు. ఆస్పత్రిలో ఉన్న భార్యాబిడ్డకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన భర్తను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది.

బిడ్డ పుట్టిన ఆనందం.. క్షణాల్లోనే విషాదం
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గౌరి, ఇన్‌సెట్‌లో సింహాచలం(ఫైల్‌)

  • ఆస్పత్రిలో భార్యకు ప్రసవం.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

  • కుమారుడికి తీవ్ర గాయాలు

  • సామగ్రిని కొనుగోలు చేసేందుకు ఆటోలో వెళ్తుండగా బోల్తా

  • రామచంద్రాపురంలో శోకసంద్రం

  • ఆమదాలవలస, జూలై 5(ఆంధ్రజ్యోతి): మృత్యువు ఏ రోజు.. ఏ రూపంలో వస్తుందో తెలియదనడానికి ఆ ఘటనే ఉదాహరణ. ప్రసవ వేదనతో బాధపడుతున్న భార్యను ఆటోలో ఆస్పత్రికి తెచ్చాడు భర్త. అక్కడ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది భార్య. తమ ఇంట రెండో సంతానంగా లక్ష్మీదేవి పుట్టిందని ఆ దంపతులు మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం ఎంతసేపూ మిగల్లేదు. ఆస్పత్రిలో ఉన్న భార్యాబిడ్డకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన భర్తను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఆటో బోల్తాపడడంతో ఆయన మృతి చెందగా, తన కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన ఆమదాలవలస మండలం రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బత్తిలి సింహాచలం(34)కు భార్య గౌరి, కుమారుడు అభిషేక్‌ ఉన్నారు. ప్రస్తుతం గౌరి నిండు గర్భిణి కావడంతో శనివారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను రాత్రి 7 గంటల సమయంలో సింహాచలం తన ఆటోలో జొన్నవలస ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చాడు. వైద్యులు గౌరికి సుఖప్రసవం చేయించారు. దీంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండో కాన్పులో కుమార్తె పుట్టడంతో కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయారు. అయితే, ఆ ఆనందం సింహాచలానికి కొన్ని గడియలు మాత్రమే మిగిలింది. ఆస్పత్రిలో ఉన్న భార్యాబిడ్డకు అవసరమైన సామగ్రి(బకెట్‌, మగ్గు, బేబీ కిట్‌)ని కొనుగోలు చేసేందుకు కుమారుడు అభిషేక్‌తో కలిసి రాత్రి 8.30గంటల సమయంలో సింహాచలం తన ఆటోలో ఆమదాలవలస పట్టణానికి బయలుదేరాడు. ఆస్పత్రి నుంచి ప్రధాన రోడ్డుపైకి ఎక్కుతుండగా ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందాడు. కుమారుడు అభిషేక్‌కి కాలు విరిగిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.

  • నిరుపేద కుటుంబం

  • సింహాచలంది నిరుపేద కుటుంబం. సొంత ఇల్లు గానీ, సెంటు భూమి గానీ లేదు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయన తండ్రి ఇప్పటికే మరణించాడు. తల్లి లక్ష్మితో పాటు భార్యాకుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మృతి చెందడంతో తాము ఎలా బతికేది అంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. భర్త మృతి చెందిన విషయం భార్య గౌరికి తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. బాలింత అయిన ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం జొన్నవలస ఆస్పత్రి నుంచి తల్లీబిడ్డను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

Updated Date - Jul 06 , 2026 | 12:15 AM