Share News

సేవ చేయాలన్నదే సంకల్పం

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:05 PM

ప్రజలకు నేరుగా సేవ చే యాలన్న ధృడ సంకల్పంతో చదివి అనుకున్న లక్ష్యం సాధించి నట్లు గ్రూపు-1 విజేత సంపతిరావు శివ నాగగౌరి తెలిపారు. డీఎస్పీగా ఎంపికైన ఆమె తన భావాలను ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

 సేవ చేయాలన్నదే సంకల్పం
మాట్లాడుతున్న శివ నాగగౌరి:

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రజలకు నేరుగా సేవ చే యాలన్న ధృడ సంకల్పంతో చదివి అనుకున్న లక్ష్యం సాధించి నట్లు గ్రూపు-1 విజేత సంపతిరావు శివ నాగగౌరి తెలిపారు. డీఎస్పీగా ఎంపికైన ఆమె తన భావాలను ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే..

మునసబుపేటలోని గాయత్రి పాఠశాలలో పదో తరగతి వరకు, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌, బీటెక్‌ (సివిల్‌) వీఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల (వెల్లూరు, తమిళనాడు)లో చది వాను. అమ్మనాన్నలకు ఇద్దరు సంతానం. ఇందులో నేను పెద్దమ్మాయిని. నాన్న ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. నాన్న వాళ్ల అన్నదమ్ములంతా ప్రభుత్వ ఉద్యోగులే. నాన్న తనకు ఉన్న భూమిని అమ్మేసి మమ్మల్ని చదివించారు.

ఒకేసారి ఆరు ఉద్యోగాలు..

వెల్లూరు వీఐటీ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తయిన వెంటనే ఒకేసారి ఆరు ఉద్యోగాలు వచ్చాయి. ఐదు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో, ఒకటి ఆర్కిడిస్‌ (బెంగళూరు)లో ఉద్యోగాలు వచ్చాయి. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఏఐఎల్‌)కు కూడా ఎంపికయ్యాను. తన చదువుకు సంబంధం ఉన్న ఆర్కిడిస్‌లో ఉద్యోగాన్నే ఎంచుకుని ఏడాది పాటు పనిచేశాను. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేయాలన్న లక్ష్యంతో 2016-17లో ఆర్కిడిస్‌లో ఉద్యోగం మానేశాను. ఆ తర్వాత 2017లో ఇరిగేషన్‌ శాఖలో ఏఈఈగా ఎంపికయ్యాను. శ్రీకాకుళంలోని వంశధార ప్రాజెక్ట్‌లో డెప్యూటేషన్‌పై ఏఈఈగా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రజలతో నేరుగా సంబంధంలేని ఉద్యోగం కావడంతో ఏదో తెలియని వెలితి మాత్రం మనసులో ఉండేది. ఈ క్రమంలో గ్రూపు-1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యాను.

వాట్సాప్‌ గ్రూపుగా ఏర్పడి..

మెయిన్స్‌ ప్రిపరేషన్‌ కోసం ఉద్యోగానికి రెండు నెలలు సెలవు పెట్టాను. ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్స్‌ కోసం నెల్లూరు, గుంటూరుకు చెందిన ఇద్దరు మహిళలతో ఓ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేశాం. ప్రతి రోజూ 8 నుంచి 10గంటల పాటు ఆన్‌లైన్‌లోనే మేము ప్రిపేరయ్యేవాళ్లం. ముఖ్యమైన అంశాలను చర్చించుకోవడం, ప్రతి కీలకాంశాన్ని ఒకటికి పదిసార్లు మరిచిపోకుండా రిపీట్‌ చేసేవాళ్లం.

కుటుంబ నేపథ్యం..

ఎస్‌ఎం పురం గ్రామానికి చెందిన సంపతిరావు రామకృష్ణరాజు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె శివ నాగగౌరి. ఆమెకు అదే గ్రామానికి చెందిన చౌదరి అవినాష్‌తో 2017లో వివాహమైంది. భర్త అవినాష్‌ శ్రీకాకుళం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మామయ్య చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, అత్త చౌదరి ధనలక్ష్మి జడ్పీ చైౖర్‌పర్సన్‌గా గతంలో పనిచేశారు. నాగగౌరి, అవినాష్‌ దంపతులకు 2018లో బాబు, 2019లో ఓ పాప జన్మించారు. భర్త, తల్లిదండ్రులు, అత్త మామల అందరి సహకారంతో విజయం సాధించినట్టు ఆమె తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 11:05 PM