Share News

లెప్రసీ పంజా!

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:08 AM

Leprosy spreading in the srikakulam జిల్లాలో లెప్రసీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఎల్‌సీడీసీ సర్వే మొక్కుబడిగా సాగింది. ఫలితంగా కొత్త కేసుల సంఖ్య గుర్తింపులో యంత్రాంగం విఫలమవుతోంది.

లెప్రసీ పంజా!
శరీరంపై ఇటువంటి బొడిపెలు, మచ్చలు లెప్రసీ అనుమానిత కేసులే..

జిల్లాలో వ్యాపిస్తున్న వ్యాధి

ఈ ఏడాది 57 కొత్తకేసులు

నేటి నుంచి మళ్లీ ఎల్‌సీడీసీ సర్వే

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో లెప్రసీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఎల్‌సీడీసీ సర్వే మొక్కుబడిగా సాగింది. ఫలితంగా కొత్త కేసుల సంఖ్య గుర్తింపులో యంత్రాంగం విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకూ మరోసారి ఎల్‌సీడీసీ సర్వేకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 57 కొత్త లెప్రసీ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఎంబీ(మల్టీ బాసిల్లరి)కేసులు 49 కాగా, పీబీ (పాసివ్‌బాసిల్లరి) కేసులు 8 ఉన్నాయి. పీబీ కేసులను సకాలంలో గుర్తించలేకపోతే అవి ఎంబీలుగా మారతాయి. 2025-26 దేశవ్యాప్తంగా 91,783కొత్త కేసులు వెలుగుచూడగా జిల్లాలో 113 కేసులు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు చిన్నారుల్లో కూడా లెప్రసీ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో లెప్రసీవ్యాధి వ్యాప్తిరేటు 0.49 గా ఉంది. లెప్రసీ నిర్మూలన దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

లక్షణాలు ఇవీ..

శరీరంపై అన్ని మచ్చలు లెప్రసీకి దారితీయవు. తెలుపు లేదా ఎర్రని, మందమైన జిడ్డుగా మెరుస్తూ ఉండే మచ్చలపై స్పర్శ లేకపోతే.. అటువంటివాటిని లెప్రసీ అనుమానస్పద కేసులుగా భావిస్తారు. మైకోబ్యాక్టీరియం లెప్పరే అనే సూక్ష్మజీవి ద్వారా ఈ అంటువ్యాధి సోకుతుంది. మచ్చలు మాత్రమే కాకుండా.. చెవులు, వీపు, ఇతర శరీర భాగాలపై నొప్పిలేని బొడిపెలు కనిపిస్తాయి. కనురెప్పల వెంట్రుకలు రాలిపోతాయి. ముక్కునుంచి రక్తం కారడం, కాళ్లుచేతులు తిమ్మిర్లు, కాళ్లలో వాపు, అరచేతులు, అరికాళ్లు స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. లెప్రసీ సోకితే.. శరీరంలో 12 నరాలు ప్రభావితం అవుతాయి. రేడియల్‌నెర్వ్‌ దెబ్బతింటే చేతుల్లో స్పర్శ ఉండదు. వేడి, చల్లదనం తెలియదు. సకాలంలో వ్యాధిని గుర్తిస్తే డిపార్మటీస్‌ వరకు వెళ్లకుండా నివారించవచ్చు. లేదంటే బాధితుడి చేతులు, కాళ్లవేళ్లు కుచించుకుపోవడం, కాళ్లకు పుండ్లు కనిపిస్తాయి. శరీరంపై మచ్చలున్నా సాధారణ జీవనానికి ఇబ్బంది ఉండకపోవడంతో చాలామందికి తమకు లెప్రసీ ఉందనే విషయమే తెలియదు. నరాలు దెబ్బతిని అవయవాలపై ప్రభావం చూపిన తరువాత కానీ బాధితుడికి అనుమానం కలగదు. మరికొందరు ఈ వ్యాధి లక్షణాలు తెలిసినా.. సామాజిక పరిస్థితుల దృష్ట్యా బయటపెట్టరు. ఫలితంగా లెప్రసీ వ్యాప్తికి కారణమవుతోంది.

తూతూమంత్రంగా సర్వే..

లెప్రసీతో భాదపడుతన్న వారిని తొందరగా గుర్తించడానికి ఉద్దేశించిన ఎల్‌సీడీసీ సర్వేలు తూతూమంత్రంగానే సాగుతున్నాయి. ఒక ఆశ కార్యకర్త, ఒక మగ వలంటీర్‌ ఇంటింటికీ వెళ్లి ఇంటిలో ప్రతీ వ్యక్తిని స్ర్కీనింగ్‌ చేయాలి. అనుమానించే మచ్చలు కనిపిస్తే సస్పెక్ట్‌గా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అనుమానిత లక్షణాలు కనిపించినవారిని వైద్యాధికారి పరిశీలించి.. లెప్రసీ అవునో.. కాదో.. నిర్ధారించాలి. కాగా క్షేత్రస్థాయిలో ఈ సర్వే సక్రమంగా జరగడం లేదు. దీంతో లెప్రసీ కేసుల సంఖ్య పెద్దగా బయటపడడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతి టీమ్‌ రోజుకు రెండు మూడు అనుమానిత కేసులను గుర్తించాలని లక్ష్యం నిర్దేశించారు. ‘జిల్లాలో ఈ నెల 11 నుంచి 24 వరకూ ఎల్‌సీడీసీ సర్వే చేపడతాం. పీహెచ్‌సీల పరిధిలో ఆశలు, ఏఎన్‌ఎంలు, మేల్‌ సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చాం. ఇంటింటికీ వెళ్లి.. లెప్రసీ బాధితులను గుర్తించేలా చర్యలు చేపడుతున్నామ’ని డీఎన్‌ఎంవో డాక్టర్‌ ప్రవీణ్‌ తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 12:08 AM