రక్తపోటు, మధుమేహం పంజా!
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:11 AM
Revealed in the NCD 4.0 survey సిక్కోలు ప్రజలను జీవనశైలి వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లోపించడం, పెరిగిన మానసిక ఒత్తిడి కారణంగా వేలాదిమంది రక్తపోటు(బీపీ), మధుమేహం (షుగర్) బారిన పడుతున్నారు.
జిల్లాలో 2.30 లక్షల మందికి బీపీ..
1.68 లక్షల మందికి షుగర్
రాష్ట్ర సగటు కంటే ముందంజలో సిక్కోలు స్ర్కీనింగ్ ప్రక్రియ
ఎన్సీడీ 4.0 సర్వేలో వెల్లడి
శ్రీకాకుళం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సిక్కోలు ప్రజలను జీవనశైలి వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లోపించడం, పెరిగిన మానసిక ఒత్తిడి కారణంగా వేలాదిమంది రక్తపోటు(బీపీ), మధుమేహం (షుగర్) బారిన పడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) 4.0’ స్ర్కీనింగ్ సర్వేలో జిల్లాకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. జిల్లాలో సుమారు 2.30 లక్షల మందికిపైగా బీపీతో, దాదాపు 1.68లక్షల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది.
స్ర్కీనింగ్‌లో భేష్..
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యఆరోగ్యశాఖ జిల్లా వ్యాప్తంగా 19,46,397 మందిని నిర్దేశిత లక్ష్యంగా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్యాధికారుల బృందాలు ఇప్పటివరకు(ఆగస్టు 31 నాటికి) 17,44,102 మందికి సర్వే పూర్తి చేసి 89.61 శాతం ప్రగతి సాధించారు. వీరిలో అందుబాటులో ఉన్న 13,24,651 మందికి(68.06 శాతం) పూర్తిస్థాయి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర సగటు స్ర్కీనింగ్ (66.05 శాతం) కంటే శ్రీకాకుళం జిల్లా మెరుగైన పనితీరు కనబరచడం విశేషం. రాష్ట్ర సగటుతో పోల్చితే జిల్లాలో వ్యాధిగ్రస్తుల శాతం(బీపీ 13.92 శాతం, షుగర్ 11.31 శాతం) స్వల్పంగా తక్కువే ఉన్నప్పటికీ.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉండటం వైద్యవర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
జిల్లా గణాంకాలివీ ...
సర్వే నిర్దేశిత లక్ష్యం : 19,46,397
సర్వే పూర్తయిన జనాభా : 17,44,102 (89.61 శాతం)
స్ర్కీనింగ్ పరీక్షలు చేసినవారు : 13,24,651 (68.06 శాతం)
బీపీ (హైపర్‌టెన్షన్) బాధితులు : 2,30,596 (11.88 శాతం)
షుగర్ (మధుమేహం) బాధితులు : 1,68,696 (8.69 శాతం)
అప్రమత్తతే శ్రీరామరక్ష...
‘‘30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ఎన్సీడీ సర్వే ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రులు, విలేజ్ క్లినిక్‌ల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. నిత్యం వ్యాయామం చేయడం, ఉప్పు, పంచదార వాడకాన్ని తగ్గించడం ద్వారా ఈ వ్యాధులను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు’’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.