జల ‘వంద’నం
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:33 AM
Water.. Special drive from today వర్షాభావ పరిస్థితులు, అడుగంటున్న భూగర్భ జలాలతో అల్లాడుతున్న రైతులు, ప్రజలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత’ పేరిట జల సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల ప్రత్యేకడ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది.
నీటి సంరక్షణే లక్ష్యంగా.. 100 రోజుల మహాక్రతువు!
నేటి నుంచి జూలై 14 వరకు ప్రత్యేకడ్రైవ్
నాగావళి, వంశధార బేసిన్ల ఆధారంగా కార్యాచరణ
భూగర్భ జలాలను కనీసం ఒక మీటరు పెంచడమే లక్ష్యం
క్షేత్రస్థాయిలో సాగునీటి సంఘాలదే కీలకపాత్ర
శ్రీకాకుళం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితులు, అడుగంటున్న భూగర్భ జలాలతో అల్లాడుతున్న రైతులు, ప్రజలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత’ పేరిట జల సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల ప్రత్యేకడ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జలవనరుల శాఖ జీవో నెంబర్ 10 విడుదల చేసింది. సోమవారం నుంచి జూలై 14 వరకు జిల్లాలో ఈ కార్యక్రమం మహాక్రతువులా సాగనుంది.
పల్లెల్లో 100 రోజుల కార్యాచరణ ఇలా
-----------------------
పనుల గుర్తింపు : ఏప్రిల్ 6 నుంచి 15 వరకు
మంజూరు ప్రక్రియ : ఏప్రిల్ 16 నుంచి 20 వరకు
పనుల అమలు : ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు
రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్ : జూలై 10 నుంచి 14 వరకు
నదులపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలోని ఐదు ప్రధాన బేసిన్లలో మన జిల్లాకు సంబంధించి నాగావళి, వంశధార నదులను చేర్చారు. ఈ బేసిన్లను శాస్త్రీయంగా మ్యాపింగ్ చేసి, ఉప బేసిన్లు, మైక్రో బేసిన్లుగా విభజించి నీటి లభ్యతను అంచనా వేస్తారు. ఏపీ డబ్ల్యూఆర్‌ఐఎంఎస్ సాంకేతికత శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి వర్షపాతం, నీటి నిల్వ సామర్థ్యాలను విశ్లేషిస్తారు. జిల్లాలో భూగర్భ జలమట్టాలను కనీసం ఒక మీటరు మేర మెరుగుపరచడమే ఈ డ్రైవ్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం భూగర్భ జలాలు 15 మీటర్లు, అంతకంటే ఎక్కువ(ముఖ్యంగా 20 మీటర్లు దాటిన) లోతుకు పడిపోయిన గ్రామాలను ‘ప్రాధాన్య జోన్లు’ గా పరిగణిస్తారు. అక్కడ చెక్‌డ్యామ్‌లు, ఫార్మ్ పాండ్స్ వంటి జల సంరక్షణ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఆయా గ్రామాల్లో సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) పద్ధతులను ప్రోత్సహిస్తారు.
సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో..
గ్రామాల్లో సాగునీటి వినియోగదారుల సంఘాల(డబ్ల్యుయూఏ) క్రియాశీల భాగస్వామ్యంతో ఈ పనులు జరుగుతాయి. మైనర్ ఇరిగేషన్ చెరువుల పూడికతీత, కట్టల పటిష్టత, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరణ పనులు చేపడతారు. సమీపంలోని కాలువలు, పెద్ద చెరువుల నుంచి చిన్న చెరువులకు నీటిని మళ్లించేలా కనెక్టివిటీ పెంచుతారు. ఉపాధిహామీ పథకం, జల్‌శక్తి అభియాన్ వంటి పథకాల నిధులతో అనుసంధానం చేసి ఈ పనులు చేపడతారు.
కలెక్టర్ పర్యవేక్షణలో..
ఈ డ్రైవ్ పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని వేశారు. ఇందులో జలవనరులు, డ్వామా, భూగర్భ జల, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. గ్రామస్థాయిలో సర్పంచ్ చైర్మన్‌గా కమిటీ ఉంటుంది. పనులను గుర్తించడం, యాప్‌లో జియో-కోఆర్డినేట్స్‌తో అప్‌లోడ్ చేయడం వీరి బాధ్యత. భూగర్భజలాలు పెంపొందించడమే లక్ష్యంగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.