Share News

విద్య, వైద్యరంగాల బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:59 PM

I will develop the CHC into a 100-bed hospital ‘విద్య, వైద్యరంగాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. కోటబొమ్మాళిలో సామాజిక ఆస్పత్రిని త్వరలో వందపడకలుగా అభివృద్ధి చేస్తామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

విద్య, వైద్యరంగాల బలోపేతమే లక్ష్యం
ప్రసూతి, శిశుఆరోగ్య విభాగం భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • సీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తా

  • ప్రజలకు మెరుగైన సేవలందించండి

  • మంత్రి అచ్చెన్నాయుడు

  • కోటబొమ్మాళి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ‘విద్య, వైద్యరంగాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. కోటబొమ్మాళిలో సామాజిక ఆస్పత్రిని త్వరలో వందపడకలుగా అభివృద్ధి చేస్తామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాళి సీహెచ్‌సీలో రూ.2.90 కోట్లతో నిర్మించిన ప్రసూతి, శిశుఆరోగ్య విభాగం భవనాన్ని, స్థానిక జూనియర్‌ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన సేవలందించాల’ని ఆదేశించారు. ‘కోటబొమ్మాళిలోని డిగ్రీ కళాశాలలో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించేలా స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వినియోగించుకోవాలి. డిగ్రీ కళాశాలకు త్వరలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తాం. డిసెంబరులో మూలపేట పోర్టు ప్రారంభిస్తాం. మూలపేట నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకు 8 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మూలపేట పోర్టుకు అనుబంధంగా వివిధ పరిశ్రమలు వస్తున్నాయి. అందుకోసం ప్రజలు ముందుకొచ్చి భూములు ఇవ్వాల’ని మంత్రి అచ్చెన్న కోరారు. అనంతరం చీపుర్లపాడు పంచాయతీలో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, టెక్కలి ఆర్డీవో ఎన్‌. కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, డీసీహెచ్‌ఎస్‌ కె.ఎన్‌.విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పొన్నాడ గణేష్‌, ప్రిన్సిపాల్స్‌ గోవిందమ్మ, అరంగి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 11:59 PM