Share News

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:51 PM

Distribution of new Pattadar passbooks ఏడాదిలోనే రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు మంత్రి పంపిణీ చేశారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

- మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఏడాదిలోనే రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు మంత్రి పంపిణీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘వైసీసీ హయాంలో రీ-సర్వే పేరుతో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. గత ప్రభుత్వం జగన్‌ బొమ్మతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి వ్యవస్థను రాజకీయ ప్రచారానికి ఉపయోగించింది. రీ-సర్వే ప్రక్రియలో హద్దురాళ్ల ఏర్పాటు పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింద’ని విమర్శించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు 2.5 లక్షల కొత్తపట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వీటిని క్యూఆర్‌ కోడ్‌తో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సాంకేతికతతో ముద్రించామన్నారు. రైతులు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని, ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారులు సరిచేసి కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం మండల రెవెన్యూ అధికారి, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయిలోనే భూ వివాదాలు పరిష్కరించే అధికారం కల్పించామన్నారు. నేరుగా రైతుల ఇళ్లకే పాస్‌పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో నిర్వహించిన ‘మీ భూమి -మీ చేతికి’ కార్యక్రమం ద్వారా 4వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అద్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:51 PM