రైతును ‘రాజు’గా నిలబెట్టడమే లక్ష్యం
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:24 AM
రైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీలో రూ.53,752.12 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర జీవనాడి అయిన సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. ప్రధానంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వంశధార ఫేజ్-2, మహేంద్రతనయ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా భావిస్తున్న వంశధార-నాగావళి నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కింద జిల్లా రైతుల ఖాతాల్లో ఇప్పటికే నిధుల జమ చేశామని, ధాన్యం కొనుగోలు బకాయిలను కూడా చెల్లించామని గుర్తు చేశారు. వ్వయసాయాన్ని లాభసాటిగా మార్చి, యువతను సాగు వైపు మళ్లించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమైనవి..
జిల్లాలో నీటి లభ్యతను పెంచేందుకు అత్యంత కీలకమైన వంశధార-నాగావళి అనుసంధానం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
పలాస, టెక్కలి ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే మహేంద్రతనయ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
వంశధార ఫేజ్-1, 2 : చిట్టచివరి ఆయకట్టుకు నీరు అందించేలా మిగిలిపోయిన పనులను పూర్తి చేయనున్నారు. వీటితో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులపైనా దృష్టి సారించారు.
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటలైన జీడిమామిడి, కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉద్దానం ప్రాంతంలో జీడి, కొబ్బరి తోటల పునరుద్ధరణకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో పాటు ప్రణాళికలు రూపొందించారు.
రైతులకు నాణ్యమైన మొక్కల పంపిణీలో భాగంగా జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. ఇప్పటికే 26,151 అంటు జీడిమామిడి మొక్కలు, 22,346 కొబ్బరి మొక్కలను రైతులకు సరఫరా చేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
కొబ్బరి తోటల్లో కోకో వంటి అంతర పంటలను సాగు చేయడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రోత్సహించనున్నారు.
జిల్లాలో అరటి సాగును విస్తరించేందుకు టిష్యూకల్చర్ అరటి మొక్కల (10,945) పంపిణీ చేపట్టనున్నారు.
ప్రతి ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే తుఫాన్లతో జిల్లా రైతులు చేతికి వచ్చిన పంటను పోగొట్టుకుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు ‘ముందస్తు ఖరీఫ్’ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల తుఫాన్ల సీజన్ రాకముందే పంట కోతలు పూర్తిచేసి రైతులు నష్టపోకుండా ఉంటారు.
జిల్లాలో సుదీర్ఘ తీరప్రాంతం ఉండి, గంగపుత్రులు అధికంగా ఉన్న నేపథ్యంలో మత్స్యశాఖకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు (రూ.523 కోట్లు) చేశారు.
వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే భృతిని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచారు. ఇది జిల్లాలోని వేలాది కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చే అంశం.
రూ.50కోట్లతో డీజిల్ సబ్సిడీ, బోట్లకు ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటుతో సముద్రంలో వేట సాగించే మన మత్స్యకారులకు రక్షణ కల్పించనున్నారు.
జిల్లాలో కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని పెంచనున్నారు. వ్వయసాయ విశ్వవిద్యాలయాల ద్వారా డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. 80 శాతం సబ్సిడీతో కిసాన్ డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇది జిల్లాలోని విద్యావంతులైన రైతు బిడ్డలకు ఉపాధి మార్గంగా మారనుంది.