భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:27 AM
జిల్లాలో భూగర్భ జలాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
- వంద రోజుల ప్రణాళికతో ‘జలధార-జలహారతి’
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూగర్భ జలాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన మండల స్థాయి బృందాలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన జలధార కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో ప్రతీ గ్రామంలో అమలు చేయాలన్నారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన బృందాలు, క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రజలు, సాగునీటి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. జూలై నాటికి నిర్దేశించిన పనులన్నీ శత శాతం పూర్తి కావాలని, ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను ఈనెల 15లోగా ముగించాలని స్పష్టం చేశారు. వంద రోజుల ప్రణాళికతో ‘జలధార--జలహారతి’ కార్యక్రమాన్ని, ప్రత్యేక కార్యాచరణతో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆదేశించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. శివారు భూములకు సాగునీరు అందేలా డ్రెయిన్లు, కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడిక తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా మిగులు జలాలను అవసరమైన చోటికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ లవరాజు, ఇరిగేషన్ ఎస్‌ఈ పొన్నాడ సుధాకరరావు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వంశధార, అటవీశాఖ అధికారులు, మండల స్థాయి బృందాల సభ్యులు పాల్గొన్నారు.