Share News

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యం

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:24 AM

జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి రాష్ట్రస్థాయికి పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం అమరావతి చాంపియన్‌షిప్‌ 2026 పోటీలను నిర్వహిస్తోందని, ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

 క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యం
చాంపియన్‌షిప్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి రాష్ట్రస్థాయికి పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం అమరావతి చాంపియన్‌షిప్‌ 2026 పోటీలను నిర్వహిస్తోందని, ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. ఈ మేరకు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన పోస్టర్‌ను బుధ వారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి (ఆగస్టు 29) పురస్కరించుకుని యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ మెగా టోర్నమెంట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. 17 ఏళ్లలోపు, 23 ఏళ్ల లోపు బాలురు, బాలికలు రెండు విభాగాల్లో 12 క్రీడాంశాల్లో ఈ పోటీలను నియోజవర్గస్థాయి నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విలువిద్య, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌బాల్‌, చెస్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్‌లిఫ్టింగ్‌, వాలీబాల్‌, యోగా విభాగాల్లో పోటీలుంటాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్‌బాబు మాట్లాడుతూ.. పోటీల షెడ్యూల్‌ ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో జట్ల ఎంపిక ట్రయల్‌ ప్రారంభమవుతుందన్నారు. ఇందులో రాణించిన క్రీడాకారులు ఈనెల 26వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంతర్‌ నియోజకవర్గం, జిల్లాస్థాయి టోర్నమెంట్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి విజేతలు ఆగస్టు 20 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. చివరిగా ఆగస్టు 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం రోజున రాష్ట్రస్థాయి తుది పోటీలుంటాయని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తప్పనిసరిగా తమ పేర్లను నియోజకవర్గస్థాయి ట్రయిల్స్‌కు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సమీపంలోని పీడీ, పీఈ టీ, డీపీఈటీ అధికారులను సంప్రదిం చాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంస్థలు, కోచ్‌లు, సమన్వ యంతో జిల్లా నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా సహకరించాలని కోరారు.

Updated Date - Jul 09 , 2026 | 12:24 AM