నగర సుందరీకరణే లక్ష్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 10:54 PM
KR Stadium to be ready by August ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ లక్ష్యసాధనలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి నగరంలోని పలు అభివృద్ధి పనులు, పార్కులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు.
ఆగస్టు నాటికి కేఆర్ స్టేడియం సిద్ధం
నాలుగు పార్కులకు రూ.2 కోట్లు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ లక్ష్యసాధనలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి నగరంలోని పలు అభివృద్ధి పనులు, పార్కులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. గూనపాలెం, హడ్కోకోలనీ, ఆర్‌కే నగర్ ప్రాంతాల్లోని పార్కులతో పాటు ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించారు. అనంతరం శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియం పనులను పరిశీలించారు. ఆగస్టు నాటికి స్టేడియం పనులు పూర్తిచేస్తామని, శాప్ ద్వారా రూ.2.6కోట్లతో అత్యాఽధునిక క్రీడా పరికరాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ‘పచ్చదనం, ఆహ్లాదం కోసం శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే కార్గిల్ విక్టరీ పార్కును ఆధునికీకరించాం. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సీఎస్‌ఆర్ నిధుల నుంచిరూ.50లక్షల చొప్పున నాలుగు పార్కుల అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించాం. నాగావళి నది ఒడ్డున కిలోమీటరు మేర వాకింగ్ ట్రాక్, రోడ్డు నిర్మిస్తాం. నగరం నుంచి బీచ్ వరకు 9 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ఏర్పాటు చేస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, సుడా ఇంజినీర్ సుగుణాకరరావు పాల్గొన్నారు.