Share News

కాలుష్య రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:11 AM

World Environment Day ‘పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. కాలుష్య రహిత సమాజ స్థాపనకు అందరూ నడుం బిగించాల’ని కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు.

కాలుష్య రహిత సమాజమే లక్ష్యం
సైకిల్‌ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి పెద్దపాడు వరకు సైకిల్‌ ర్యాలీ

శ్రీకాకుళం అర్బన్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. కాలుష్య రహిత సమాజ స్థాపనకు అందరూ నడుం బిగించాల’ని కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ సైకిల్‌యాత్ర నిర్వహించారు. అంతకుముందు నగరంలో కాలుష్య స్థాయిని కొలిచేందుకు రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన నిరంతర పరిసర గాలి నాణ్యత, పర్యవేక్షణ వ్యవస్థ డిజిటల్‌ బోర్డును కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు. మొక్కలు నాటారు. అలాగే కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి పెద్దపాడులోని బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల వరకు సాగిన సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ ‘ప్రధాని నరేం ద్రమోదీ పిలుపు మేరకు ‘నా దేశం.. నా బాధ్యత’ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ఇంటిలో జరిగే ప్రతి శుభాకార్యంలోనూ తల్లిపేరు మీద ఒక మొక్క నాటాలి. జిల్లావ్యాప్తంగా దశలవారీగా 15 వేల మొక్కలు నాటాలని నిర్ణయించాం. కాలుష్య నివారణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు సైకిల్‌ తొక్కాలని పిలుపునిచ్చారు. దానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలైనంత తగ్గించాలి. ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రాగా మార్చాల’ని తెలిపారు. జిల్లాలో 59 పాఠశాలలను నెట్‌ జీరో స్కూల్‌గా తీర్చిదిద్ది విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ కరుణ శ్రీ, కార్పొరేషన్‌ కమిషనర్‌ హనుమంతు కూర్మారావు, ప్రాంతీయ కార్యాలయ అధికారులు, కార్పొరేషన్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:11 AM