డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా..
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:14 AM
Mega Cordon Search మాదకద్రవ్యాలు పూర్తిస్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో శనివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్‌ను, కుటుంబ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు.
జిల్లాలో మెగా కార్డన్‌సెర్చ్
1,030 ఇళ్లల్లో తనిఖీలు
55 వాహనాలు సీజ్
శ్రీకాకుళం క్రైం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలు పూర్తిస్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో శనివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్‌ను, కుటుంబ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, క్రయవిక్రయాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా శనివారం శ్రీకాకుళం నగరంలోని వాంబేకాలనీ, టెక్కలిలో ఆదిఆంధ్రావీధి, కాశీబుగ్గలో సూదికొండ ప్రాంతంలో పోలీసులు మెగా కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో సుమారు 170 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్‌లు విస్తృతంగా తనిఖీలు చేశారు. జిల్లావ్యాప్తంగా 1,030 ఇళ్లల్లో తనిఖీలు చేసి.. బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను కూడా పరిశీలించారు. ద్విచక్ర వామనాలు, ఆటోలు, కార్లు తదితర 535 వాహనాల రికార్డులు పరిశీలించి.. పత్రాలు సరిగా లేని 55 వాహనాలను సీజ్ చేశారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టారు. ఐదు మంది పాత గంజాయి నేరస్థుల జీవన విధానం ఆరా తీశారు. పాత నేరస్థుల కదలికపై సమాచారం సేకరించారు. శ్రీకాకుళంలో ఓ ఇంట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఏఎస్పీ కేవీ రమణ తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు కనిపించినా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ పోరాడాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.