Share News

ప్రభుత్వ బడుల్లో వంద శాతం ప్రవేశాలే లక్ష్యం

ABN , Publish Date - May 30 , 2026 | 11:50 PM

The aim is to provide quality education ‘జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో వంద శాతం ప్రవేశాల లక్ష్యాన్ని సాధించాలి. ఇందుకోసం అధికారులు, ఉపాధ్యాయులు సరికొత్త వ్యూహాలతో, సానుకూల దృక్పథంతో, సమన్వయంతో పనిచేయాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ బడుల్లో వంద శాతం ప్రవేశాలే లక్ష్యం

  • నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయం

  • ‘బడి పిలుస్తోంది’ విజయవంతం కావాలి

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 30(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో వంద శాతం ప్రవేశాల లక్ష్యాన్ని సాధించాలి. ఇందుకోసం అధికారులు, ఉపాధ్యాయులు సరికొత్త వ్యూహాలతో, సానుకూల దృక్పథంతో, సమన్వయంతో పనిచేయాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎంఈవోలు, క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. లక్ష్యాలను సాధించి, విజయవంతం చేయాలి. నాణ్యమైన విద్యతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. ఐదేళ్లు నిండిన పిల్లలను 1వ తరగతిలో చేర్పించడంలో బూర్జ, లక్ష్మీనర్సుపేట, మెళియాపుట్టి, సంతబొమ్మాళి, సారవకోట మండలాలు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించడం హర్షణీయమ’ని తెలిపారు. ఉన్నత తరగతుల నమోదులో జిల్లా సగటు అత్యంత మెరుగ్గా ఉందన్నారు. లావేరు, పలాస, బూర్జ మండలాలు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. మిగిలిన మండలాలు కూడా ఇదే స్ఫూర్తితో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న ఆధునిక సౌకర్యాలు, ‘లీప్‌’ కార్యక్రమం ద్వారా అందిస్తున్న విద్యా ప్రమాణాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేలా పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో డీఈవో ఏ.రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్ష ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:50 PM