Share News

పాఠశాలల్లోనే దేశ భవిష్యత్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:12 AM

Old students come forward for development దేశభవిష్యత్‌ పాఠశాలల్లో నిర్మితం అవుతుందని, అలాంటి పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు.

పాఠశాలల్లోనే దేశ భవిష్యత్‌
‘ప్రజాదర్బార్‌’లో సమస్యలను తెలుసుకుంటున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

అభివృద్ధికి పూర్వవిద్యార్థులు ముందుకురావాలి

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

నరసన్నపేట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశభవిష్యత్‌ పాఠశాలల్లో నిర్మితం అవుతుందని, అలాంటి పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం కోమర్తి గ్రామానికి చెందిన వైశ్యరాజు జ్యూయలరీ యజమాని ఫల్గుణరావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో ఆధునికీకరణ చేపట్టిన గ్రామ పాఠశాల భవనాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో పాఠశాలలు ఎంతో దోహదపడతాయన్నారు. ఫల్గుణరాజును ఆదర్శంగా తీసుకొని పూర్వపు విద్యార్థులు తమ పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలన్నారు. ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ.. పూర్వపు ఉపాధ్యాయుడు కొల్లి ఇల్లయ్య వేసిన పునాదితో కోమర్తిలో ఎంతోమంది నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ముందుగా పాఠశాల ఆవరణలో సరస్వతిదేవి విగ్రహంతోపాటు ఇల్లయ్య మాస్టార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే కంబకాయి గ్రామంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన, ప్రముఖ వైద్యుడు కింజరాపు అమ్మన్నాయుడు, వైశ్యరాజు ఫల్గుణరాజు, శిమ్మ జగన్నాథం, కింజరాపు సూర్యనారాయణ, ముద్దాడ అప్పలనాయుడు, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, పొందర కుల చైర్మన్‌ దామోదర నర్సింహులు, శిమ్మ చంద్రశేఖర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పోగోటి ఉమామహేశ్వరి, పోగోటి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 12:12 AM