నిధులు సరే.. పనులేవీ?
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:25 AM
Problems in tribal villages గిరిజన గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా అధ్వాన రహదారులు, అరకొర వైద్యసేవలతో గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గిరిజన గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు
చాలాచోట్ల అధ్వానంగా రహదారులు
నేడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి రాక
మెళియాపుట్టిలో గిరిజన దర్బార్‌కు ఏర్పాట్లు
మెళియాపుట్టి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా అధ్వాన రహదారులు, అరకొర వైద్యసేవలతో గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తున్నా.. పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సోమవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.బొజ్జిరెడ్డి జిల్లాకు రానున్నారు. మెళియాపుట్టిలో గిరిజన దర్బార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గిరిజనులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. సబ్‌ప్లాన్ నిధులను సైతం దారి మళ్లించింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా.. పనులు ప్రారంభించి చాలాచోట్ల అర్ధాంతరంగా వదిలేశారు. వైసీపీ నాయకులు పనులు చేయకుండానే బిల్లులు నొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులను విజిలెన్స్‌కు అప్పగించింది. మరికొన్ని పనులకు పల్లెపండుగ పేరిట నిధులు కేటాయించింది. జిల్లాలో గిరిజన గ్రామాల్లో 268 పనులకుగాను రూ.109.7 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇందులో ఒక్క పాతపట్నం నియోజకవర్గంలోనే 123 పనులకు రూ.57.49 కోట్లు మంజూరయ్యాయి. అధికంగా గ్రామాల్లో రహదారులకు సంబంధించి నిధులు కేటాయించారు. కాగా.. చాలాచోట్ల పనులు పూర్తికాని పరిస్థితి నెలకొంది. మెళియాపుట్టి మండలం పెద్దకేదారి, కుడ్డ, తదితర గ్రామాల్లో పాత రహదారులు తవ్వేసి వదిలేయడంతో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
జల్‌జీవన్ పథకం కింద ఈ ఏడాది మే నాటికి మెళియాపుట్టి మండలంలో ఇంటింటికీ తాగునీరు అందించాల్సి ఉంది. ఈ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. రహదారులు లేక 108 అంబులెన్స్ వాహనాలు సైతం గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్‌లు ఇచ్చినా.. అవి పాడైపోయాయి. సబ్‌సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికంగా ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలుకాని పరిస్థితి కనిపిస్తోంది. జీసీసీ ద్వారా సక్రమంగా సేవలు అందక గిరిజనులు ఇబ్బందులు తప్పడం లేదు.
వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమైంది. దీంతో జిల్లాలోని మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించినా.. ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీంతో తమ సమస్యలు పరిష్కరించే నాథులే కరువయ్యారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.