పీహెచ్‌సీల పనితీరు సరిగా లేదు
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:29 PM
జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్యాధికారులను ఆదేశించారు.
- 66 పీహెచ్‌సీలకు మూడింటికే ఏ-గ్రేడ్
- వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పీహెచ్‌సీల పనితీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 66 పీహెచ్‌సీలకు గాను కేవలం మందస, గార, బాతువ మాత్రమే ‘ఏ’ గ్రేడ్ సాధించాయన్నారు. తొగరాం, నౌగాం లాంటి కేంద్రాలు అత్యల్పంగా ‘డి’గ్రేడ్‌కు పరిమితమవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవలో నిర్లక్ష్యం వహిస్తే ఏమాత్రం సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ బాధితులకు తక్షణ సేవలు అందించేలా అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక ఓఆర్‌ఎస్ కార్నర్లు, మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో తొమ్మిది వడదెబ్బ కేసులు నమోదయ్యాయన్నారు. ఆదివారంపేట యూపీహెచ్‌సీల వంటి కేంద్రాల్లో క్యాన్సర్ నిర్థారణ పరీక్షలను వేగవంతం చేయాలని, హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌వో డా.కె.అనిత మాట్లాడుతూ.. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 80శాతం పిల్లలకు స్ర్కీనింగ్ పూర్తయ్యిందని, మిగిలిన వారికి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించి ఇప్పటికే 80శాతం మందికి వ్యాక్సినేషన్ వేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి, ఎస్‌వో రామనాగేశ్వరరావు, పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.