Share News

అడవికి ‘నిధుల’ గ్రహణం

ABN , Publish Date - May 30 , 2026 | 11:58 PM

Proposals worth over Rs. 10 crores.. but zero sanction జిల్లాలో అటవీ విస్తరణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువవుతోంది. పచ్చదనం పెంపు, ఏనుగుల దాడుల నియంత్రణ, అరుదైన పక్షులు, తాబేళ్ల సంరక్షణ కోసం జిల్లా అటవీశాఖ రూపొందించిన బృహత్తర ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి.

అడవికి ‘నిధుల’ గ్రహణం

  • కాగితాలకే పచ్చదనం పరిమితం

  • ప్రభుత్వానికి రూ.10కోట్లకుపైగా ప్రతిపాదనలు.. మంజూరు మాత్రం సున్నా

  • ఏనుగుల దాడి బాధితులకు అందని నష్ట పరిహారం

  • శ్రీకూర్మం ‘నగర్‌ వన్‌’ పనుల నిలిపివేత

  • జీతాల్లేక ‘క్యాంపా’ సిబ్బంది, వాచర్ల అవస్థలు

  • తాబేళ్లు, పక్షుల రక్షణపై తీవ్ర నిర్లక్ష్యం

  • జిల్లా అటవీశాఖ తాజా నివేదికలో బయటపడిన వాస్తవాలు

  • శ్రీకాకుళం, మే 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ విస్తరణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువవుతోంది. పచ్చదనం పెంపు, ఏనుగుల దాడుల నియంత్రణ, అరుదైన పక్షులు, తాబేళ్ల సంరక్షణ కోసం జిల్లా అటవీశాఖ రూపొందించిన బృహత్తర ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2026-27 సంవత్సరానికి గాను వివిధ పథకాల కింద సుమారు రూ.10కోట్లకుపైగా నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. నేటికీ ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. ఈ నెల 1న జిల్లా అటవీశాఖ అధికారి సంతకంతో విడుదలైన పనుల నివేదిక ఆధారంగా ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణం 4,59,100 హెక్టార్లు కాగా.. అందులో అటవీ ప్రాంతం 44,574.95 హెక్టార్లు (9.76 శాతంగా) ఉంది. జిల్లా పరిధిలో మొత్తం 4 అటవీ రేంజ్‌లు, 18 సెక్షన్లు, 31 బీట్‌లు, 74 రిజర్వ్‌ బ్లాకులు ఉన్నాయి. ఇంతటి విస్తారమైన అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉండగా.. దస్త్రాలు సెక్రటేరియేట్‌లోనే మగ్గిపోతున్నాయి.

  • ఏనుగుల దాడి బాధితులకు పరిహారం నిల్‌!

  • జిల్లాలోని ఏజెన్సీ సరిహద్దు గ్రామాలను ఏనుగుల సమస్య ఏళ్ల తరబడి పట్టి పీడిస్తోంది. మానవ- వన్యప్రాణి ఘర్షణ నివారణ, ఏనుగులకు అడవిలోనే ఆవాసం కల్పించే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ కింద రూ.20 లక్షలతో పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదు. ఏనుగుల దాడుల వల్ల పంటలు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులు, రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం నిధులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ‘క్యాంపా’ పథకం కింద ప్రతిపాదించిన నిధుల్లో ఈ పరిహారం కూడా ఉండగా.. సర్కారు నుంచి నిధులు రాకపోవడంతో బాధితులు ఎదురుచూస్తున్నారు.

  • శ్రీకూర్మం పనుల నిలిపివేత వెనుక ఆంతర్యమేమిటి?

  • అటవీశాఖకు నిధులు రావడం గగనంగా మారితే.. ఎంతో కొంత నిధులు వచ్చి, 90 శాతానికి పైగా పూర్తయిన పనులను మధ్యలోనే ఆపేయడం విమర్శలకు తావిస్తోంది. ‘నగర్‌ వన్‌’ పథకం కింద శ్రీకాకుళం రేంజ్‌ పరిధిలోని శ్రీకూర్మం పంచాయతీ ఎస్‌.మత్స్యలేశంలో(40 హెక్టార్లలో) రూ.160 లక్షల ప్రతిపాదనలకు రూ.112 లక్షలు విడుదలయ్యాయి. రూ.97.30 లక్షల మేర పనులు కూడా జరిగాయి. అయితే, సాక్షాత్తూ కలెక్టర్‌ ఆదేశాల మేరకే ప్రస్తుతం ఈ పనులను నిలిపివేసినట్లు అటవీ శాఖ నివేదిక స్పష్టం చేసింది. దీని వెనుక కారణాలేమిటో అధికార యంత్రాంగమే సమాధానం చెప్పాలి. అయితే ఇదే ‘నగర్‌ వన్‌’ కింద మెళియాపుట్టి(మందస ఆర్‌ఎఫ్‌)లో రూ. 140 లక్షలు, పాతపట్నంలో రూ.123.90 లక్షలు విడుదలై పనులు సాగుతున్నాయి.

  • క్యాంపా నిధులు నిల్‌

  • అడవుల పెంపకం, నిర్వహణకు అత్యంత కీలకమైన ‘క్యాంపా’ నిధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్లాంటేషన్‌, సహజ అడవి పెంపకం, నర్సరీల నిర్వహణతోపాటు.. అడవిని నమ్ముకుని ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, వాచర్లు, డ్రైవర్ల వేతనాల కోసం ఏకంగా రూ.5.38 కోట్లతో (రూ. 538.80 లక్షలు) ప్రతిపాదనలు పంపగా నేటికీ ఆమోదం లభించలేదు. ఇక వేసవిలో అడవులకు నిప్పంటుకుంటే ఆర్పేందుకు ‘ఫారెస్ట్‌ ఫైర్‌ ప్రొటెక్షన్‌ మేనేజెమెంట్‌(ఎఫ్‌ఎఫ్‌పీఎం)’ కింద ఫైర్‌ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదించిన రూ.30 లక్షలు, గ్రీన్‌ ఇండియా మిషన్‌(జీఐఎం) కింద అడిగిన రూ. 1.48 లక్షలు కూడా మంజూరు కాలేదు.

  • తాబేళ్లు, పక్షుల రక్షణ గాలికి...

  • సముద్ర తీరప్రాంతాల్లో అంతరించిపోతున్న అరుదైన ‘ఆలివ్‌ రిడ్లే’ తాబేళ్ల సంరక్షణ కోసం హేచరీల నిర్వహణ, వాచర్ల జీతభత్యాల నిమిత్తం రూ.39.74 లక్షలు మంజూరు చేయాలని కోరగా.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. ఇక సుదూర దేశాల నుంచి వలస వచ్చే విదేశీ పక్షులకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన తేలినీలాపురం, తేలికుంచి కేంద్రాల అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలేసింది. ‘వనవిహారి’(ఎకో-టూరిజం) పథకం కింద రూ.25 లక్షలు, 4- శాంక్చురీ పథకం (ఈఈసీ) కింద రూ.20లక్షలు ప్రతిపాదించగా కనీస ఆమోదం దక్కలేదు.

  • కలెక్టర్‌ వద్దే ‘ఉపాధి’ దస్త్రాలు..

  • ఉపాధిహామీ పథకం కింద సామాజిక అటవీ విభాగం ద్వారా జిల్లాలో 26.20 లక్షల మొక్కలు నాటేందుకు రూ.3.02 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలు కలెక్టర్‌ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు డీఎఫ్‌వో నివేదిక వెల్లడిస్తోంది. ఏదేమైనా, అటవీ విస్తరణ, వన్యప్రాణుల రక్షణ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పర్యావరణానికి ముప్పు తప్పదని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • అటవీశాఖ ప్రతిపాదనలు ఇలా..

  • ------------------------------------------------------

  • పథకం పేరు నిధులు (రూ.లక్షల్లో)

  • -----------------------------------------------------

  • క్యాంపా 538.80

  • నరేగా 302.38

  • ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల రక్షణ 39.74

  • ఫైర్‌ ప్రొటెక్షన్‌ (ఎఫ్‌ఎఫ్‌పీఎం) 30.00

  • వనవిహారి (ఎకో టూరిజం) 25.00

  • ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ 20.00

  • 04-శాంక్చురీ(పక్షుల కేంద్రం) 20.00

  • గ్రీన్‌ ఇండియా మిషన్‌ (జీఐఎం) 1.48

Updated Date - May 30 , 2026 | 11:58 PM