Share News

వరద కాలువను కప్పేస్తున్నారు

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:36 PM

Occupancy of government land in Palasa పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. కొండల ప్రాంతాల్లో అనధికారికంగా కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వరహాలు గెడ్డకు అనుకుని ఉన్న వరద కాలువను సైతం కప్పేసి.. రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లుగా మార్చేందుకు కొందరు యత్నించారు. దీనిపై స్థానిక రైతుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని ఆక్రమణలు అడ్డుకున్నారు.

వరద కాలువను కప్పేస్తున్నారు
ఆక్రమించి చదును చేస్తున్న కాలువ భూములను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి

పలాసలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ

అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

పలాస, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. కొండల ప్రాంతాల్లో అనధికారికంగా కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వరహాలు గెడ్డకు అనుకుని ఉన్న వరద కాలువను సైతం కప్పేసి.. రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లుగా మార్చేందుకు కొందరు యత్నించారు. దీనిపై స్థానిక రైతుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని ఆక్రమణలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పలాస మండలం కంబిరిగాం రోడ్డులో వరహాలుగెడ్డకు అనుసంధానంగా తుప్పలగుడ్డి వరద కాలువ, పోరంబోకు స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.3కోట్ల వరకు ఉంది. భూముల ధర విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆక్రమణకు దారితీస్తోంది. ఈ ప్రాంతంలో జిరాయతీ భూములు కొనుగోలు చేసిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు శుక్రవారం తమ భూమితోపాటు పక్కనే ఉన్న వరదకాలువ, ప్రభుత్వ భూములను కూడా కలిపి యంత్రాలతో చదును చేయించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కుడివైపు భూభాగంలో అనధికారంగా కంకర తవ్వకాలు చేపట్టారు. వరహాలుగెడ్డ భూములు సైతం ఆక్రమించేశారు. దీనిపై గనులశాఖ సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా.. వరహాలుగెడ్డకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ భూములు, కాలువ స్థలాలు ఆక్రమించి.. చదును చేస్తుండడంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు. అయిన వారు వెనక్కి తగ్గకపోవడంతో రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ టి.కళ్యాణచక్రవర్తి సంఘటన స్థలానికి వెళ్లి నిర్వాహకులను ప్రశ్నించారు. తక్షణమే పనులు నిలుపుదల చేయాలని లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా సర్వే రికార్డుల ప్రకారం సదరు కాలువ భూములు తమకే చెందుతాయని, తాము ఎటువంటి కబ్జాలకు పాల్పడడం లేదని నిర్వాహకులు చెప్పారు. రికార్డులు పరిశీలించిన తరువాత తమ ఆదేశాల మేరకు చదును చేసుకోవాలి తప్ప.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనధికార మట్టి తవ్వకాలు జోరందుకున్న నేపథ్యంలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో కాలువ భూముల ఆక్రమణపై కొరడా ఝులిపించారు.

Updated Date - Mar 06 , 2026 | 11:36 PM