సమస్యల పరిష్కారానికి తొలిఅడుగు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:49 PM
నరసన్నపేటలోని పల్లిపేట జంక్షన్ వద్దగల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి మంచి స్పందన లభించిం ది.
‘ఆంధ్రజ్యోతి’ అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన
నరసన్నపేటలో భారీగా హాజరైన ప్రజలు
నరసన్నపేట/ జలుమూరు/ పోలాకి/ కోటబొమ్మాళి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని పల్లిపేట జంక్షన్ వద్దగల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి మంచి స్పందన లభించిం ది. ఈ సందర్భంగా ఇందిరానగర్, హడ్కోకాలనీల్లో సమస్యలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ స మస్యలు పరిష్కారానికి తొలిఅడుగు పడిం దని వారంతా చెబుతున్నారు. తమ సమ స్యలను ఎమ్మెల్యేతోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటికి వారి నుంచి సానుకూల స్పందన లభించింది. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్య లకు పరిష్కారం దిశగా అడుగులు పడడం పై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
చెరువులో వ్యర్థాలతో నీరు కలుషితం
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నుంచి వచ్చే నీరు, వ్యర్థాలు గాంధీనగర్ సమీపంలో గల చెరువులో చేరడంతో నీరు కలుషితమవుతోంది. దీంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి.
- పుచ్చల విశ్వేశ్వరరావు, సిటీజన్ ఫోరం అధ్యక్షుడు, ఇందిరానగర్
మందుబాబుల ఆగడాలు
హడ్కోకాలనీ పక్కనే గల వంశధార క్వార్టర్స్ పరిసరాల్లో శిథిలమైన భవనాల్లో యువకులు గంజాయి సేవిస్తున్నారు. అలాగే మందుబాబులు ఆగడాలు ఎక్కువయ్యాయి. పొద్దుపోయాక ఆ మార్గంలో ఇళ్లకు రావాలంటే మహిళలు భయపడుతున్నారు. చెత్తను తీసేందుకు పారిశుధ్యకార్మికులు వీధుల్లోకి రావడం లేదు.
- డొంకాన గాయిత్రీ, హడ్కోకాలనీ
భయంతో పాఠశాలకు పిల్లలకు పంపుతున్నాం
హడ్కోకాలనీలో సుమారు 700 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ పేద, మధ్యతరగతి వర్గానికి చెందిన వారు నివసిస్తున్నారు. భయంతో పాఠశాలకు పిల్లలకు పంపుతున్నాం. బడికి వెళ్లిన నుంచి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిస్తే పిల్లలు కూర్చోలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు కొత్తభవనం నిర్మించాలి.
- వి.మీనా, హడ్కోకాలనీ, నరసన్నపేట
పైపులు వేసినా తాగునీరు రావడం లేదు
హడ్కోకాలనీలో ఇంటింటా తాగునీటి పైపులు వేసినా తాగునీరు రావడం లేదు. కాలనీలో నాలుగే తాగునీటి కుళాయిలు ఉన్నాయి. ఇంటింటా పైపులకు తాగునీరు కనెక్షన్ ఇవ్వాలి. తాగునీటికోసం ఇబ్బంది పడుతున్నాం. పంచాయతీ అధికారులు చొరవ తీసుకోవాలి.
- అరుణ, హడ్కోకాలనీ, నరసన్నపేట
ప్రధాన కాలువ ఆక్రమణ
ఇందిరానగర్‌లో ప్రధాన కాలువ ఆక్రమణలకు గురయ్యింది. దీంతో చెరువులకు నీరు పెట్టేందుకు మార్గం లేకుండాపోయింది. పల్లిపేట జంక్షన్ వద్ద పోలాకి మార్గంలో వచ్చే బస్సులు టర్న్ చేసేందుకు డివైడర్ అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఆటోలు పక్కన నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందిరానగర్-1లో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి.
- మార్పు విజయ్, ఇందిరానగర్ కాలనీ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు
పార్క్‌ను వినియోగంలో తీసుకురావాలి
ఇందిరానగర్‌లోని పార్క్‌ను వినియోగంలోకి తీసుకురావాలి. పార్క్‌లో రీడింగ్ రూమ్‌ను నిర్మించి దినపత్రికలు, ఇతర అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలి. ఇందిరానగర్ ప్రారంభంలో పాడైన రోడ్డు మరమ్మతు చేయాలి.
-తర్ర లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, ఇందిరానగర్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తిచేయాలి
సీఎం చంద్రబాబునాయుడు ఇందిరానగర్‌ను స్మార్ట్ వార్డుగా గతంలో గుర్తించారు. ఆ విధంగా కాలనీలో 40 అడుగులు రోడ్లు ఉండేవిధంగా చర్యలు తీసుకొని, రోడ్లకు ఇరువైపు చెట్లు నాటే బాధ్యత స్థానికులకే అప్పగించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌ను పూర్తిచేయాలి.
-పాట్నూరు రమేష్, బంగార వర్తకుల సంఘ నాయకులు, నరసన్నపేట
నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలి
హడ్కోకాలనీలో ఒక మంచినీటి కొళాయి మాత్రమే ఉండడంతో తాగునీటికి ఇబ్బందికరంగా ఉంది. వర్షంకురిస్తే నీరు నిల్వ ఉండి దోమలు చేరుతున్నాయి. వీధి చివర సీసీ రోడ్డువేయాలి. నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలి.
- హడ్కోకాలనీ, నరసన్నపేట
వీధి దీపాలు సకాలంలో వేయాలి
పట్టణంలో వీధి దీపాలు సకాలంలో వేయాలి. సంతపేట రోడ్డు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.
- సాసుపల్లి కృష్ణబాబు, ఉపసర్పంచ్, నరసన్నపేట
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
వంశధార కాలనీలో శిథిలమైన క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా పెంచాం. ఇటీవల హాడ్కోకాలనీలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించాం. డ్రోన్ కెమెరాలతో రాత్రి సమయంలో పహారా కాస్తున్నాం. గంజాయి తాగేవారిపై ఉక్కుపాదం మోపుతాం.
- బలివాడ గణేష్, ఎస్‌ఐ, నరసన్నపేట
చిల్డ్రన్ పార్క్ పునర్నిర్మించాలి
ఇందిరానగర్ కాలనీలో ఎర్రంనాయుడు చిల్డ్రన్‌పార్క్‌ను పునర్నిర్మించాలి. గతంలో పార్క్‌ను ధ్వంసం చేసినవారిని కఠినంగా శిక్షించాలి. విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలి. బోరుబావులను నిర్మించాలి.
- సదాశివుని రాంబాబు, రిటైర్డు ఉపాధ్యాయుడు, ఇందిరానగర్ కాలనీ
మరికొందరి మాటల్లో..
- వంశధార కాలనీకి పారిశుధ్య కార్మికులు రావడం లేదని కాలనీకి చెందిన పైల అప్పారావు తెలిపారు. చెత్త ఇళ్లు, వీధుల్లో పేరుకుపోతోందని చెప్పారు. మురుగునీరు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
- సంతతోట వద్ద గల గోరువాని చెరువు కలుషితంతో కంపు కొడుతుందని సీఆర్‌ఎంటీ పి.తారకేశ్వరరావు తెలిపారు. స్నానాలు చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. చెరువులో వ్యర్థాలు వేయకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
- హడ్కోకాలనీలోగల సామాజిక భవనం చుట్టూ ప్రహరీ ఏర్పాటుచేయాలని ఆ కాలనీకి చెందిన గుడ్ల శ్రీరాములు కోరారు. భవనం అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మరమ్మతులుచేయాలని తెలిపారు.
- జమ్ముజంక్షన్ వద్ద వంశధార కాలనీలో డ్రైనేజీ నిర్వహణ బాగోలేదని కాలనీకి చెందిన ఎం.జగదీష్ తెలిపారు. చెత్త తీసుకువెళ్లేందుకు పారిశుధ్య కార్మికులు రావడంలేదని, ప్రతి రోజూ కాలువలో చెత్తను పడేస్తున్నారని చెప్పారు. కాలనీ ఉన్నట్లు బోర్డు ఏర్పాటుచేయాలని కోరారు.
- హడ్కోకాలనీ గల జీమ్‌ను ఆధునికీకరించి యువతకు అందుబాటులో తీసుకురావాలని కాలనీకి చెందిన మణికంఠ కోరారు. యాంత్రీక జీవితంలో అందరికి అవసరమైన పార్క్‌ను అభివృద్ధి చేయాలని తెలిపారు.
- మారుతీనగర్, శ్రీరామనగర్, జయలక్ష్మీనగర్ కాలనీల నుంచి వచ్చే మురుగునీరు నరసన్నచెరువులో చేరుతోందని ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు రాము తెలిపారు. చెరువుకు ఆనుకొని ఉన్న పచోరికాలనీ వాసులు దోమలతో ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. మురుగునీరు చెరువులో నిల్వలేకుండా బయటకు వెళ్లే మార్గం చూపాలని, కాలువకు పైపులైన్లను అనుసంధానం చేయాలని కోరారు.
- నరసన్నపేట పాతబస్టాండ్‌లో రోడ్డు మధ్యలో ఇష్టానుసారంగా డివైడర్లు ఏర్పాటు చేసి రాకపోకలకు వీల్లేకుండా చేయడంతో వ్యాపారాలు సాగక వ్యాపారులు అవస్థలు పడుతున్నారన్నారని వర్తక, వాణిజ్య సంఘ గౌరవాధ్యక్షుడు జామి వెంకట్రావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైవడర్లను తొలగించి వ్యాపారాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవా లని కోరారు. పాతబస్టాండ్‌లో దుకాణాలు మూసుకోవడంతో వ్యాపారులు రోడ్డున పడడంతో వారిని ఆదుకోవాలని తెలిపారు.
-పట్టణంలో చెత్తను తొలగించడంలో జాప్యం జరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని బండివీధికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ సరియపల్లి మధు తెలిపారు. బండివీధిలోగల అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహారీ నిర్మించాలని, శ్రీనివాసగర్‌లో డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని కోరారు.
- పట్టణంలో శతశాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అనుసంధానం చేసి ఫైలేరియాను నిర్మూలించాలని జగన్నాథపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు పీస కృష్ణ కోరారు. డంపింగ్ యార్డు నుంచి పొగలు రాకుండా, చెత్త వృథాకాకుండా చర్య తీసుకోవాలని పేర్కొన్నారు. పొగ వల్ల జగన్నాథపురంవాసులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.
- పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పనితీరు మెరుగుపరిచేందుకు పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని శివాజీనగర్ కాలనీకి చెందిన వార్డు సభ్యుడు గొలివి రామారావు కోరారు. పైకప్పులు లేని ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని, దుర్వాసన నుంచి విముక్తి కల్పించాలని తెలిపారు.
- సంతపేట వద్దగల శ్మశానంలో ఆక్రమించి ప్రహరీ నిర్మించారని, తక్షణమే ఆక్రమణలు తొలగించాలని నరసన్నపేట ఎంపీటీసీ మాజీ సభ్యుడు నేతింటి విశ్వేశ్వరరావు కోరారు. కంబకాయిరోడ్డులోగల కారి చెరువు నుంచి వచ్చే నీరు పొలాల మీద పడి మునిగిపోతుండడంతో కాలువను అభివృద్ధిచేసి నీరువెళ్లే మార్గం చూపాలని తెలిపారు.
- వంశధార క్వార్టర్స్ శిథిలావస్థకు చేరడంతో స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని నరసన్నపేట మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు తెలిపారు. వాటిని పరిరక్షించి ప్రభుత్వం ఇతర శాఖలకు సంబంధించిన భవనాలు నిర్మించాలని కోరారు. పల్లిపేట జంక్షన్ నుంచి జమ్ము జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేయాలని, చర్మాల చెరువులో ఆక్రమణలు తొలగించాలని తెలిపారు.