Share News

తొలివిడత పల్లెపోరుకు సై

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:20 AM

జిల్లాలో పల్లె పోరు రసవత్తరంగా మారింది. తొలి విడత ఎన్నికలు జరగనున్న పలాస రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో నామినేషన్లు ఉపసంహరణ పర్వం ముగియడంతో తుది పోటీకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

తొలివిడత పల్లెపోరుకు సై

- పలాస డివిజన్‌లో 21 పంచాయతీలు ఏకగ్రీవం

- 173 సర్పంచ్‌ స్థానాలకు 473 మంది, 1,033 వార్డులకు 2,192 మంది బరిలో

- 886 వార్డులు ఏకగ్రీవం.. మూడు వార్డుల్లో జరగని ఎన్నికలు

- మూడో విడతకూ పోటెత్తిన నామినేషన్లు

- రెండు రోజుల్లోనే 5,997 దాఖలు

శ్రీకాకుళం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పల్లె పోరు రసవత్తరంగా మారింది. తొలి విడత ఎన్నికలు జరగనున్న పలాస రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో నామినేషన్లు ఉపసంహరణ పర్వం ముగియడంతో తుది పోటీకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. తొలివిడతలో నోటిఫై చేసిన 194 సర్పంచ్‌ స్థానాలకు గాను 21 పంచాయతీలు (10.82 శాతం) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 173 సర్పంచ్‌ స్థానాలకు 473 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. వార్డు సభ్యుల విభాగంలో నోటిఫై చేసిన 1,922 స్థానాలకు గాను 886 వార్డులు (46.10శాతం) ఏకగ్రీవమయ్యాయి. మూడు వార్డుల్లో వివిధ కారణాలతో పోలింగ్‌ జరగడం లేదు. మిగిలిన 1,033 వార్డులకు 2,192 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా తొలి విడతలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 2,665 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు జిల్లాలోని 11 మండలాల్లో జరుగుతున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలి రెండు రోజుల్లోనే 5,997 నామినేషన్లు దాఖలవడం గ్రామీణ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు అద్దం పడుతోంది.

మూడో విడతకు పోటెత్తిన నామినేషన్లు...

జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకుంది. తొలి రెండు రోజుల్లో (నవంబరు 21 నాటికి) సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 5,997 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 1,853 నామినేషన్లు రాగా, రెండో రోజు ఆ సంఖ్య రెండింతలకు పైగా పెరిగి ఏకంగా 4,144కు చేరింది. సర్పంచ్‌ స్థానాలకు తొలి రోజు 455, రెండో రోజు 881 చొప్పున మొత్తం 1,336 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు తొలి రోజు 1,398, రెండో రోజు 3,263 చొప్పున మొత్తం 4,661 నామినేషన్లు అందాయి.

డివిజన్ల వారీగా...

శ్రీకాకుళం డివిజన్‌లో అత్యధికంగా 3,259 (సర్పంచ్‌ 623, వార్డులు 2,636), టెక్కలి డివిజన్‌లో 2,714 (సర్పంచ్‌ 709, వార్డులు 2,005), పలాస డివిజన్‌లో 24 (సర్పంచ్‌ 4, వార్డులు 20) నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా సర్పంచ్‌ స్థానాలకు సంతబొమ్మాళి మండలంలో అత్యధికంగా 201 నామినేషన్లు అందాయి. ఆ తర్వాతి స్థానాల్లో జలుమూరు (158), నందిగాం (142), నరసన్నపేట (140), కోటబొమ్మాళి (128), పోలాకి (123), సారవకోట (121), టెక్కలి (117), గార (108), శ్రీకాకుళం (94) నిలిచాయి. వార్డు సభ్యుల నామినేషన్లలో జలుమూరు మండలం 616 నామినేషన్లతో అగ్రస్థానంలో ఉండగా, నరసన్నపేట (598), శ్రీకాకుళం (567), సారవకోట (480), కోటబొమ్మాళి (469), గార (437), పోలాకి (418), సంతబొమ్మాళి (357), టెక్కలి (352), నందిగాం (347) మండలాల్లో పోటీ హోరాహోరీగా సాగుతోంది.

Updated Date - Nov 23 , 2026 | 12:20 AM