Share News

పల్లె గూటికి పండగొచ్చింది

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:35 PM

పెద్దల పండుగ అయిన సంక్రాంతిని వైభవంగా జరుపుకొనేందుకు వలస జీవులు స్వగ్రామాలకు తరలివస్తున్నారు.

   పల్లె గూటికి పండగొచ్చింది
పలాస రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు

- సొంతూళ్లకు తిరిగివస్తున్న వలస జీవులు

- గ్రామాల్లో సందడి

కోటబొమ్మాళి/నరసన్నపేట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): పెద్దల పండుగ అయిన సంక్రాంతిని వైభవంగా జరుపుకొనేందుకు వలస జీవులు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఉపాధి నిమిత్తం ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా జిల్లాకు వలస పక్షులు చేరుకుంటున్నాయి. దీంతో జిల్లాలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బతుకుతెరువు కోసం పట్టణాలకు వెళ్లిన వారంతా తిరిగి వస్తుండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. మొన్నటి వరకూ తాళాలు వేసి ఉన్న ఇళ్లతో బోసిపోయిన గ్రామాలు నేడు జనంతో కళకళలాడుతున్నాయి. తమవారిని చూసి ఇళ్ల వద్ద ఉంటున్న వృద్ధుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.

వేడుకలు ప్రారంభం

గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. హరిదాసుల సందడి, చెంచుల నృత్యాలు, జంగాల పొగడ్తలు, గంగిరెద్దుల ఆటలతో పాటు ముత్యాల ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. భోగి పిడకలను తయారు చేయడంలో చిన్నారులు మునిగితేలుతున్నారు. ఇళ్లకు రంగులు వేయడంతో పాటు అందంగా అలంకరణ చేసే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. వాకిళ్లను గొబ్బెమ్మలు, ముత్యాల మొగ్గులతో అలంకరిస్తున్నారు.

పిల్లల చదువు కోసమే..

కన్నవారిని, సొంతూరిని వదిలి వెళ్లాలంటే బాధగా ఉంటుంది. నా వాళ్లు.. మా బంధువులు, ఇల్లు ఇక్కడే ఉన్నా.. బతుకు తెరువు కోసం పిల్లల చదువు, వారి బంగారు భవిష్యత్‌ కోసం కష్టాన్ని దిగమింగి ప్రతిఏటా చెన్నైకు వలస వెళుతున్నాం. అక్కడ సిమెంట్‌ పని చేస్తుంటాం. మేం అక్కడ ఉన్నా పిల్లలు, వారి భవిష్యత్‌ పైనే దృష్టి పెడతాం. వారికి ఏం చేస్తే మాలాగా వలస వెళ్లకుండా మంచి జీవితం గడుపుతారోనని ఆలోచిస్తుంటాం. వారు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొందేందుకే మేం కష్టపడుతున్నాం. సంక్రాంతికి వచ్చి పది రోజులు వారితో ఆనందంగా గడిపి తిరిగి వలస వెళ్లిపోతాం.

- హమంతు గోపమ్మ, వలసకూలీ, ఊడికలపాడు, కోటబొమ్మాళి

Updated Date - Jan 07 , 2026 | 11:35 PM