Share News

రైతు పంట పండింది

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:37 AM

ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. అనుకున్న దానికంటే ఎక్కువగా దిగుబడి వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  రైతు పంట పండింది
కరగాం వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు

- ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి

- సన్నాలకు పెరిగిన గిరాకీ

- ఇళ్లకు చేరుతున్న ధాన్యం

నరసన్నపేట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. అనుకున్న దానికంటే ఎక్కువగా దిగుబడి వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణ, సాంబ మసూరి వంటి రకాలు ఎకరాకు 30 బస్తాల నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తుండగా.. 1061, తరంగణి, అమూల్య వంటి రకాలు కూడా చాలా ప్రాంతాల్లో ఎకరాకు 35 బస్తాలకు పైగా దిగుబడి వస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో వరిసాగు విస్తీర్ణం 17 శాతం తగ్గింది. 3.85 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఇటీవల వరుస తుఫాన్లతో సుమారు 15వేల ఎకరాల్లో కొంతమేరకు నష్టం ఏర్పడింది. అయితే, తెగుళ్లు, దోమ వంటి చీడలు తగ్గుముఖం పట్టడం, రైతులు యాజమాన్య పద్ధతులు పాటించడం కారణంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొన్నిచోట్లే కొనుగోలు కేంద్రాలు..

జిల్లాలో కొన్నిచోట్లే అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు దళారీలకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం సాధారణ రకాలకు క్వింటాకు రూ.2,441, గ్రేడ్‌-ఏ రకాలు క్వింటాకు రూ.2,461 మద్దతు ధర నిర్ణయించింది. జిల్లాలో 80 కేజీల బస్తా చొప్పున రైతులు విక్రయిస్తుంటారు. దీని ప్రకారం బస్తాను (సాధారణ రకం) రూ.1,952కు, గ్రేడ్‌-ఏ రకాన్ని రూ.1,969కు కొనుగోలు చేయాలి. ధాన్యం కోనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూడాలని రైతులు కోరుతున్నారు.

సన్నాలకు గిరాకీ..

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు పెరిగాయి. దీంతో సన్నరకం ధాన్యంకు గిరాకీ పెరిగింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ఎక్కువ చెల్లించి క్వింటా రూ.3,200 నుంచి రూ.3,400 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వంశధార, నాగావళి కాలువల పరివాహక ప్రాంతాల్లో అక్కడక్కడే మాత్రమే సన్న రకం ధాన్యాలను సాగు చేశారు. ఇప్పుడు ధరలు పెరగడంతో రబీలో వాటిని సాగు చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:37 AM