Share News

కొలువుల జాతర

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:21 AM

Job calendar sparks hope among the unemployed కూటమి ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకిగానూ జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎలా అయినా ఈసారి ప్రభుత్వ కొలువులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

కొలువుల జాతర
శ్రీకాకుళంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు

  • జాబ్‌క్యాలెండర్‌ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు

  • డీఎస్సీపైనే ఎక్కువ మంది దృష్టి

  • శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకిగానూ జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎలా అయినా ఈసారి ప్రభుత్వ కొలువులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు.. శిక్షణ కేంద్రాల్లో పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో మొత్తం 10,060 పోస్టులు భర్తీ చేయనుంది. ఇప్పటికే తొలివిడత 1,523 పోస్టులకు సంబంధించి ఉన్నత విద్యా శాఖ మే 15న నోటిఫికేషన్‌ విడుదలైంది. రెండో విడత 3,231 పోస్టులకుగానూ వచ్చే నెల 15న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మూడో విడత 2,311 పోస్టులకుగానూ అక్టోబరు 15న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. అదే రోజు నాలుగో విడత కూడా ఉపాధ్యాయులు, ఇతర పోస్టులు 2,995 భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎస్సీ వంటి అధికారిక బోర్డులకు ఖాళీల భర్తీ బాధ్యత అప్పగించింది. ఈ నియామకాలన్నీ రోస్టర్‌ పాయింట్లు, ప్రభుత్వ రిజర్వేషన్‌ నిబంధనలకు కట్టుబడి జరగాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కొలువుల జాతర ప్రారంభం కావడంతో నిరుద్యోగులు ఇదొక అద్భుత అవకాశంగా.. పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎక్కువ మంది డీఎస్పీ కొలువులపై దృష్టి సారించారు. కొందరు కానిస్టేబుళ్ల జాబ్‌ కోసం పోటీ పడుతున్నారు. ఇంకొందరు గ్రూప్‌-2, ఇతర పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. మారుమూల గ్రామాలకు చెందిన నిరుద్యోగులు.. జిల్లాకేంద్రానికి చేరుకుని అద్దె గదుల్లో నివసిస్తూ చదువుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి సైతం కొంతమంది నిరుద్యోగులు, యువత ఇక్కడకు వచ్చి.. పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

  • నా టార్గెట్‌ టీచర్‌ పోస్టే

  • ఈ సారి డీఎస్సీలో ఎలాగైనా టీచర్‌ పోస్ట్‌ సాధించాలన్న పట్టుదలతో చదువుతున్నాను. డీఎస్సీలో సోషల్‌స్టడీస్‌ కావడంతో గట్టి పోటీ ఉంటుందని తెలుసు. మరింత కష్టపడి చదువుతాను. నా తమ్ముడు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

  • - ఆర్‌.స్వాతి, బీఏబీఈడీ, అరసవిల్లి

  • జాబ్‌క్యాలెండర్‌ వరం

  • ఈ సారి ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ నాలాంటి వారికో వరం లాంటిది. కానిస్టేబుల్‌ జాబ్‌ సాధించడానికి గట్టి ప్రిపరేషన్‌ చేస్తున్నాను. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం మైదానంలో బాగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. 300 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ మీద దృష్టి పెడుతున్నాను.

  • - డి.ధనుంజయ్‌, పెదకొంగరాం, ఎచ్చెర్ల

  • గ్రూప్‌-2పైనే గురి

  • ప్రైవేట్‌ విద్యాసంస్థలో పార్ట్‌టైం పనిచేస్తున్నాను. ప్రభుత్వ కొలువు కొట్టాలన్నదే నా లక్ష్యం. గ్రూప్‌-2పై గురిపెట్టాను. శ్రీకాకుళంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలు చదువుతున్నాను. డీఎస్పీపై కూడా దృష్టి పెట్టాను. ఈసారి ఎలా అయినా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది.

  • - ఎల్‌.అప్పలసూరి, లావేటిపేట గ్రామం, ఎచ్చెర్ల మండలం

Updated Date - Aug 26 , 2026 | 12:21 AM