Share News

ఖర్చులు మీవే!

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:24 AM

Local leaders themselves must arrange the funds ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓట్లు రాలాలంటే సొమ్ములు విదల్చాల్సిందే. ఆ అభ్యర్థి మంచోడా?.. పని చేస్తాడా? అన్నది చాలామంది ఓటర్లకు అనసవరం. ఆ పార్టీ అభ్యర్థి ఇంతిచ్చాడు.. దానికంటే ఎక్కువ ఇస్తేనే ఓటు వేస్తామన్న పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో కనబడుతోంది.

ఖర్చులు మీవే!

  • అవసరమైతే స్థానిక నేతలే సర్దుబాటు చేయాలి

  • అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు

  • బెంబేలెత్తిపోతున్న అభ్యర్థులు

  • తలలు పట్టుకుంటున్న ముఖ్యనాయకులు

  • నరసన్నపేట, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓట్లు రాలాలంటే సొమ్ములు విదల్చాల్సిందే. ఆ అభ్యర్థి మంచోడా?.. పని చేస్తాడా? అన్నది చాలామంది ఓటర్లకు అనసవరం. ఆ పార్టీ అభ్యర్థి ఇంతిచ్చాడు.. దానికంటే ఎక్కువ ఇస్తేనే ఓటు వేస్తామన్న పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో కనబడుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో నరసన్నపేట పట్టణానికి ఆనుకొని ఉన్న ఒక పంచాయతీలో ఓటుకు రూ.5వేల వరకు అభ్యర్థులు పంచారు. ఈసారి ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మొత్తాన్నే ఓటర్లు ఆశిస్తున్నారు. అయితే, జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు, 30 జడ్పీటీసీ స్థానాలు, 542 ఎంపీటీసీ స్థానాలు, 910 పంచాయతీల్లో బరిలో నిలిచే అభ్యర్థులే ఖర్చులు భరించుకోవాలని దాదాపుగా అన్ని పార్టీల అధిష్ఠానాలు స్పష్టం చేసేశాయి. దీంతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ ఓ అడుగు ముందుకేసి ఒక్కపైసా కూడా పార్టీ నుంచి రాదని, లోకల్‌ నాయకులే సర్దుబాటు చేసుకోవాలని చెప్పేసింది. దీంతో ఆ పార్టీ లోకల్‌ నాయకత్వం మరింత ఆందోళనలో పడిపోయింది.

  • గత మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీసీ నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అదే మాదిరిగా ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా లక్షల్లో వ్యయం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓ మండలానికి చెందిన వైసీపీ నాయకులు ఎంపీపీ పీఠం కోసం రూ.కోటి వరకు ఖర్చు చేస్తానని చెబుతున్నారు. దీంతో మిగతా మండలాల్లోని వైసీపీ నేతలు తాము ఎక్కడ నుంచి తీసుకొచ్చి సొమ్ములు పోయాలంటూ బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కొందరు అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. దీనికి కారణం జనసమీకరణకు అవసరమైన డబ్బులు లేకపోవడమే. మరికొందరు అభ్యర్థులు ఖర్చులకు భయపడి బరిలో నుంచి నెమ్మదిగా జారుకుంటున్నారు. దీంతో లోకల్‌ ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జిలు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసిన వాళ్లది సైతం ఇదే పరిస్థితి.

  • నరసన్నపేట మూడో ప్రాదేశిక స్థానం నుంచి ఓ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఓ అభ్యర్థి రూ.12లక్షల వరకు డిమాండ్‌ చేశాడు. కనీసం రూ.10లక్షలు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పడంతో స్థానిక నాయకులు వేరొక వ్యక్తితో నామినేషన్‌ వేయించారు. ప్రచారంలో పాల్గొన్న వారికి భోజనాలు, సాయంత్రానికి సొమ్ములు, మందు మామూలే. ఇవికూడా ఆయా స్థానిక ముఖ్యనేతలు భరించాల్సి వస్తోంది. అభ్యర్థుల్లో చాలా తక్కువ మంది మాత్రమే తమ ఖర్చులను సొంతంగా భరించేందుకు ముందుకు వస్తున్నారు. మిగతా వాళ్లకు మాత్రం నాయకులే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ ఫండ్‌ కోసం అభ్యర్థనలు చేస్తున్నారు. అయినా పైనుంచి పైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం మున్సిపల్‌, ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికలు ఒకటి తర్వాత మరొకటి నెలరోజుల పాటు జరగనున్నాయి. ఇన్నిరోజులు ఖర్చులు భరించడం ముఖ్య నేతలకు కూడా భారమే. దీంతో పంచాయతీ ఎన్నికలకు స్థానికంగా అందుబాటులో లేకుండా వేరేచోటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

  • ఎన్నికల నిర్వహణకు నిధుల కొరత

  • స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు నిధుల కొరత వెంటాడుతోంది. ఒక్కో మండలానికి ఎన్నికల ఖర్చు రూ.3 లక్షలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 జడ్పీటీసీలు, 542 ఎంపీటీసీ స్థానాలతో 912 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలాలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికల సామగ్రిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమకూర్చనుంది. మిగిలిన స్టేషనరీ, ఎన్నికల సామగ్రి రవాణా, సమావేశాలు, బ్యానర్లు, బ్యాలెట్‌ బాక్సుల మరమ్మతులు, జిరాక్స్‌లు, హమాలీ ఖర్చులు, సిబ్బంది శిక్షణ, స్నాక్స్‌, భోజనాలు తదితర బిల్లుల భారమంతా మండల, జిల్లా అధికారులపైనే పడుతోంది. ఈ అవసరాల కోసం నిధులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న స్టేషనరీ దుకాణాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఎంపీడీవోలు గగ్గోలు చెందుతున్నారు. గతంలో ఎన్నికలకు ముందే ప్రత్యేక నిధులు కేటాయించేవారని, ఈసారి ఒక పైసా కూడా మంజూరు చేయకపోవడంతో ఆర్థికభారం తప్పడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో ఎన్నికల వ్యయం రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు చేరుకుందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని ఎన్నికల నిర్వహకులు అభ్యర్థిస్తున్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:24 AM