తాగునీటి కష్టాలు తీరనున్నాయ్
ABN , Publish Date - May 05 , 2026 | 12:11 AM
Permanent solution to the drinking water problem పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వర్షాధార ప్రాంతం కావడంతో.. వేసవి వచ్చిందంటే చాలు ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు వర్ణనాతీతం.
రూ.121.99 కోట్లతో సమగ్ర మంచినీటి పథకానికి గ్రీన్‌సిగ్నల్
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో మూడు ప్యాకేజీలుగా పనులు
పలాస, మే 4(ఆంధ్రజ్యోతి): పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వర్షాధార ప్రాంతం కావడంతో.. వేసవి వచ్చిందంటే చాలు ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రస్తుతం ఉద్దానం రక్షితనీటి పథకం జంట పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తోంది. మహేంద్రతనయ నది నుంచి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. లక్షకుపైగా జనాభా ఉన్న ఈ మునిసిపాలిటీకి ఆ నీరు చాలక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష తాగునీటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందిస్తూ ఇటీవల రూ.121.99 కోట్లతో సమగ్ర మంచినీటి పథకానికి మోక్షం కల్పించింది. పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద శరవేగంతో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ జలాశయం నుంచి గ్రావెటీ ద్వారా పలాస- కాశీబుగ్గకు తాగునీరందించేలా సమగ్ర మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. మొత్తం మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టనుంది.
ప్యాకేజీ-1 కింద రూ.37.89 కోట్లు వెచ్చిస్తుంది. ఈ నిధులతో రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయరు ఇన్‌టెక్ వెల్, వీరభద్రాపురం వద్ద 13.50 ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న అత్యాధునిక తాగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తారు.
ప్యాకేజీ-2 కింద రూ.37.94 కోట్లు ఖర్చు చేయనున్నారు. జగన్నాథసాగరం, సూదికొండ, ఆర్ అండ్ బీ బంగ్లా ప్రాంతాల్లో భారీ మంచినీటి నిల్వ ట్యాంకులు నిర్మిస్తారు. ప్రధాన పైపులైన్ల విస్తరణ పనులు చేపడతారు.
ప్యాకేజీ-3 కింద రూ.46.16 కోట్లు ఖర్చు చేయనున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని అన్నీ వార్డుల్లో 80 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లు వేసి అనుసంధానం చేస్తారు. కనీసం 13వేల గృహాలకు పూర్తిస్థాయి తాగునీరందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. దీంతోపాటుగా అత్యాధునిక సాంకేతిక పద్ధతిలో నీటి సరఫరాను పర్యవేక్షించడానికి మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆఫ్‌షోర్ రిజర్వాయరు ఆధారిత మంచినీటి పథకానికి రూ.100 కోట్లు మంజూరు చేసినా, ఫైల్స్ పెండింగ్‌లో ఉండిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో రిజర్వాయర్, మంచినీటి పథకం అటకెక్కిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఆఫ్‌షోర్ రిజర్వాయరు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు బకాయిలు చెల్లించింది. కొత్తగా బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసింది. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి శాశ్వత మంచినీటి పథకానికి నిధులు కేటాయించింది. ఈ పనులు పూర్తయితే తమకు తాగునీటి కష్టాలు తీరనున్నాయని మునిసిపాలిటీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సమస్య పరిష్కరించేలా..
పలాస-కాశీబుగ్గ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రూ.121.99 కోట్ల మేర నిధులు ఇస్తుంది. దీంతో శాశ్వతంగా మంచినీటి ఇబ్బందులు తొలగుతాయి. ఆఫ్‌షోర్ రిజర్వాయరు సకాలంలో పూర్తిచేసి తాగునీటి అవసరాలు కూడా తీర్చడానికి సంకల్పించాం. కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిరూపించాం.
గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస