‘డిజిటల్’ మాయాజాలం!
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:14 AM
ఓ వృద్ధుడికి చెందిన భూమిని కాజేసేందుకు శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు, ఓ తహసీల్దార్ (ప్రస్తుతం రిటైర్డ్) కలిసి ‘డిజిటల్ మాయాజాలం’ చేశారు.
- కుశాలపురంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్
- ‘డిజిటల్ కీ’ దుర్వినియోగం చేసిన గత తహసీల్దార్
- చనిపోయిన వ్యక్తి పేరిట ఆన్‌లైన్ రికార్డులు
- వృద్ధుడి భూమి స్వాహా
- దీని వెనుక వైసీపీ కీలక నేత
-ఆధారాలతో సహా బయటపెట్టిన బాధితుడు
- పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
శ్రీకాకుళం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఓ వృద్ధుడికి చెందిన భూమిని కాజేసేందుకు శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు, ఓ తహసీల్దార్ (ప్రస్తుతం రిటైర్డ్) కలిసి ‘డిజిటల్ మాయాజాలం’ చేశారు. ‘డిజిటల్ కీ’ దుర్వినియోగం చేసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌కు పూనుకున్నారు. చనిపోయిన వ్యక్తుల పేరిట ఆన్‌లైన్ రికార్డులు సృష్టించారు. మరణించిన నాలుగేళ్ల తర్వాత ఏకంగా సబ్ డివిజన్లు చేశారు. ఈ కుంభకోణాని బాధితుడు పక్కా ఆధారాలతో బయటపెట్టాడు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామంలోని సర్వే నంబర్ 169/12పిలో ఉన్న 12.5 సెంట్ల భూమికి సంబంధించి 2004లో వేర్వేరు క్రయ దస్తావేజుల ద్వారా లావాదేవీలు జరిగాయి. ఇందులో అండుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ పేరిట ఉన్న 5 సెంట్ల భూమిని మెట్ట ప్రసాదరావు అనే వృద్ధుడు 2007లో కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ భూమి ఆయన భౌతిక స్వాధీనంలోనే ఉంది. అయితే, ఈ ఐదు సెంట్ల భూమికి సంబంధించిన రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్ (డిజిటల్ సిస్టమ్)లోకి ఎక్కించకుండా, అక్రమాలకు పునాది వేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంలో నాటి ఎచ్చెర్ల తహసీల్దార్ పాత్ర అత్యంత కీలకమని బాధితుడు ప్రసాదరావు పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. సదరు తహసీల్దార్ 2018లో జూలైలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఆ ఏడాది మే నుంచి జూలై మధ్య కాలంలో తన ‘డిజిటల్ కీ’ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘రీసైన్’ ఆప్షన్ ద్వారా వెబ్‌ల్యాండ్ సర్వర్ నుంచి అసలు సర్వే నంబర్ 169/12పీ ఉనికినే చెరిపేశారు. దాని స్థానంలో ట్యాంపర్ చేసిన 169/12ని సృష్టించారు. 2004 కంటే ముందే మరణించిన ఓ వ్యక్తి పేరిట ఏకంగా 27 సెంట్ల భూమిని వెబ్‌ల్యాండ్‌లోకి తెచ్చి డిజిటల్ ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ నకిలీ ఎంట్రీల ఆధారంగానే 2018 నవంబరు 13న నకిలీ మీసేవ ఆర్‌ఓఆర్-1బీ జారీ చేసి, అదే రోజు అక్రమ సెటిల్మెంట్ దస్తావేజును సృష్టించినట్లు బాధితుడు ఆధారాలు చూపుతున్నాడు.
సూత్రధారి వైసీపీ నాయకుడేనా?
ఈ మొత్తం భూ కుంభకోణానికి గతంలో వైసీపీ ఐటీ సెల్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన.. నగరంలో పీఎన్ కాలనీకి చెందిన నాయకుడే ప్రధాన సూత్రధారి అని బాధితుడు ఆరోపిస్తున్నాడు. నకిలీ 1బీ ఆధారంగా సదరు నేత చనిపోయిన ఆయన తండ్రి పేరిట అక్రమ సెటిల్మెంట్ దస్తావేజు సృష్టించారని, తర్వాత ఆయన బినామీల పేరిట వరసగా రిజిస్ట్రేషన్లు చేయించి ‘చైన్ ఆఫ్ ఫ్రాడ్’కు తెరతీశాడని బాధితుడు చెబుతున్నాడు. చట్ట ప్రకారం ఒకే గ్రామంలో ఒకే రైతుకు రెండు ఖాతాలు ఉండకూడదు. కానీ, వైసీపీ నేత తండ్రికి 2016 నుంచే చట్టబద్ధమైన ఖాతా ఉన్నప్పటికీ, ఫోర్జరీ కోసం ఉద్దేశపూర్వకంగా మరో డూప్లికేట్ ఖాతా సృష్టించాడు. ఆయన 2020 నవంబరులో మరణించాడు. విచిత్రంగా ఆయన చనిపోయిన నాలుగేళ్ల తర్వాత.. 2024 ఆగస్టులో మృతుడి పాత డూప్లికేట్ ఖాతాను చట్టవిరుద్ధంగా రీ-ఓపెన్ చేశారు. ట్యాంపర్ చేసిన సర్వే నంబర్‌ను సబ్ డివిజన్లగా విభజించి అసలు సర్వే నెంబర్ ఉనికిని రికార్డుల నుంచి తుడిచిపెట్టేశారు.
ఉన్నతాధికారులు స్పందించేరా..?
తన భూమికి సంబంధించి డిజిటల్ ఫోర్జరీ, రికార్డుల మాయాజాలంపై బాధితుడు ప్రసాదరావు గత మూడేళ్లుగా పీజీఆర్‌ఎస్ (స్పందన) ద్వారా అధికారులకు మొరపెట్టుకుంటూనే ఉన్నాడు. అయినా ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయ అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ నాయకుడు తనకున్న రాజకీయ పలుకుబడితో అధికారులను బెదిరిస్తూ అక్రమాలను కప్పిపుచ్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, డిజిటల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన నాటి అధికారులు, వైసీపీ నేత, బినామీలపై విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అసలైన రికార్డులను పునరుద్ధరించి న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
కుశాలపురం భూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ తహసీల్దార్‌కు ఇటువంటి వివాదాలు కొత్తేమీ కాదని తెలుస్తోంది. పొన్నాడ గ్రామంలోని పలు సర్వే నెంబర్లలోనూ ఆయన ఇలాగే అక్రమ మ్యుటేషన్లకు పాల్పడినట్లు గతంలో సీసీఎల్‌ఏ విచారణలో తేలింది. దీనిపై ప్రభుత్వం 2020 జూన్ 17న (జీఓ ఎంఎస్ 177) ఆయనపై శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ భూ కుంభకోణంలో మరో విస్తుపోయే నిజం దాగి ఉంది. సదరు వైసీపీ నేత సృష్టించిన అక్రమ బినామీ రిజిస్ట్రేషన్‌లో ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్న ఓ వ్యక్తి.. ఏడాదిన్నర కిందట నకిలీ కరెన్సీ కేసులో పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు.