ముంచెత్తిన తుఫాన్
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:26 AM
Heavy rain across the srikakulam ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బుధవారం తుఫాన్ తీరం దాటే అవకాశముందని.. అధిక ప్రభావం జిల్లాపైనే పడనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నెల 25 వరకు జిల్లాపై తుఫాన్ ప్రభావం చూపనుందని వెల్లడించింది.
జిల్లావ్యాప్తంగా భారీ వర్షం
మరో నాలుగు రోజులు ఇదే తీవ్రత
మరింత అప్రమత్తమైన యంత్రాంగం
నేడు విద్యాసంస్థలకు సెలవు
శ్రీకాకుళం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బుధవారం తుఫాన్ తీరం దాటే అవకాశముందని.. అధిక ప్రభావం జిల్లాపైనే పడనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నెల 25 వరకు జిల్లాపై తుఫాన్ ప్రభావం చూపనుందని వెల్లడించింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులను హెచ్చరిస్తూ.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ అవసరమైన సూచనలు చేశారు. ఇటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కలెక్టర్‌తో తరుచూ సమావేశం నిర్వహించి జిల్లాలో పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.
అంతా జలమయం
తుఫాన్ ప్రభావంతో వంశధార, నాగావళి నదుల్లో నీటిప్రవాహం పెరుగుతోంది. నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస జలాశయాల్లోకి వర్షపునీరు చేరింది. గెడ్డలు, వాగులు ఉప్పొంగాయి. శ్రీకాకుళం నగరం జలమయమైంది. కాలువలు, రోడ్ల విస్తరణ వల్ల మురుగునీరు, వర్షపునీరు రోడ్లపై ప్రవహించింది. బలగ, ఆదివారంపేట, పాతఫారెస్ట్ ఆఫీసు రోడ్లు, ఆర్టీసీ కాంప్లెస్స్, ఇలిసిపురం, రైతుబజార్ ఆవరణ అంతా జలమయ్యాయి. ప్రజలు అవస్థలకు గురయ్యారు. మరో ఐదురోజుల వరకు జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సి ఉందని పరిస్థితులు సూచిస్తున్నాయి. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గార, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, రణస్థలం, ఎచ్చెర్ల, పోలాకి, నరసన్నపేట, వజ్రపుకొత్తూరు, సోంపేట తదితర మండలాల్లో తీరప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ‘ఆర్నవ్’ తుపాను ఏవిధమైన విధ్వంసం సృష్టిస్తుందో అని బెంబేలెత్తుతున్నారు.
సముద్రంలోకి ‘వంశధార’ నీరు
తుఫాన్ ప్రభావంతో క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వంశధార అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలో వరద ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ముందు జాగ్రత్తగా గొట్టాబ్యారేజీ ఎగువ ప్రాంతంలో నిల్వ ఉంచిన నీటిని కొంతమేర కిందకు విడిచిపెడుతున్నారు. మంగళవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 8,500 క్యూసెక్కులు వస్తుండగా 20గేట్లు 20 సెంటీమీటర్లు పైకెత్తి నిల్వనీటితోపాటు 13,288 క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి పంపిస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువ గేట్లను మూసివేశారు. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు లేవని 169.20 మిల్లీమీటర్లు వర్షపాతం మాత్రమే నమోదైందని వంశధార అధికారులు తెలిపారు.
తీరప్రాంత గ్రామాల్లో కలెక్టర్ పర్యటన
తీవ్ర వాయుగుండం ముప్పు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. జీరుపాలేం, అల్లివలస, కొవ్వాడ గ్రామా లకు చెందిన మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తీరప్రాంతాల్లో సముద్ర పరిస్థితి, గాలుల తీవ్రతను పర్యవేక్షించారు. అత్యవసర సమయంలో తీరప్రాంత ప్రజలను, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వర్షాలు, ఈదురుగాలుల వలన ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పునరావస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశిం చారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని సూచించారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో బుధవారం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలకు అత్యవసర సహాయార్థం అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసి... ప్రజలకు ఫోన్ నంబర్లను తెలిసేలా ప్రకటన జారీచేశారు. మండ లాల్లో పరిస్థితిని గమనిస్తూ తాజా సమాచారాన్ని తెలియజేయాలని.. నదీ పరివాహక ప్రాంతాలకు, తీరప్రాంతాల ప్రజలకు ఇబ్బందిలేకుండా అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ప్రజలకు విపత్తు సాయం, అత్యవసర సమాచారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (08942- 240557)ను ఏర్పాటు చేశామన్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తితే.. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే 255 మంది వర్క్‌మెన్, సిబ్బందిని, 15 ప్రత్యేక వాహనాలను, 13 క్రేన్స్, 9 పోల్ డ్రిల్లింగ్ మిషన్స్ సిద్ధం చేశారు. అలాగే రోడ్లపై కూలిన చెట్లను తొలగించేందుకు 30 పవర్‌పాస్‌లు, 350 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, 700 విద్యుత్ స్థంభాలు, 1083 జనరేటర్స్‌ను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి హెల్ప్‌డెస్క్ 94906 12633 ఏర్పాటు చేశారు.
సహాయక చర్యలకు సిద్ధం: ఎస్పీ
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మంళవారం రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో ఆయన పర్యటించారు. అలాగే జిల్లా పోలీసు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘ప్రజలు ముంపు ప్రాం తాలు, లోతట్టు ప్రమాదాలకు వెళ్లరాదు. జిల్లాలో రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు 17 ప్రత్యేక బలగాలను సిద్ధం చేశాం. ప్రజలకు అత్యవసర సేవలకు పోలీస్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ (డయల్ 112, లేదా 63099 90933) ఏర్పాటు చేశామ’ని తెలిపారు. డీఎస్పీలు శ్రీకాకుళం(63099 90804), కాశీబుగ్గ (63099 90805), టెక్కలి (63099 90811), స్పెషల్ బ్రాంచ్(63099 90911) కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉంచామని ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
=====================
పలాస 100.75
వజ్రపుకొత్తూరు 93.7
టెక్కలి 93.61
సంతబొమ్మాళి 88.16
కోటబొమ్మాళి 87.5
నందిగాం 85.7
సారవకోట 74.7
మందస 74.0
సరుబుజ్జిలి 71.0
జలుమూరు 70.75
నరసన్నపేట 69.25
పాతపట్నం 65.9
ఎల్.ఎన్.పేట 65.4
పోలాకి 64.0
పాతపట్నం 62.8
హిరమండలం 62.3
సోంపేట 60.5
మెళియాపుట్టి 60.2
ఆమదాలవలస 58.23
గార 55.3
లావేరు 54.9
పోలాకి 53.4
ఎచ్చెర్ల 51.75
రణస్థలం 51.3
బూర్జ 48.6
కంచిలి 47.75
కొత్తూరు 46.7
కవిటి 30.0
జి.సిగడాం 16.5