ముదిరిన చిట్టీ వివాదం
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:48 AM
వరుసకు అత్త అయిన ఓ మహిళ వద్ద చిట్టీ పాడి సొమ్ము కాజేసి.. తిరిగి చెల్లించకపోవడంపై యువతీ, యువకులపై శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు ఆదివారం చీటింగ్ కేసు నమోదు చేశారు.
రూ.12 లక్షలు కాజేసిన యువతి, యువకుడు
చీటింగ్ కేసు నమోదు
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): వరుసకు అత్త అయిన ఓ మహిళ వద్ద చిట్టీ పాడి సొమ్ము కాజేసి.. తిరిగి చెల్లించకపోవడంపై యువతీ, యువకులపై శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు ఆదివారం చీటింగ్ కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని చిన్నబజారు రోడ్డులోని గొల్లపల్లి అనిత తన దగ్గర బంధువుల నుంచి సేవింగ్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి చిట్టీలు కట్టించేది. అనితకు దగ్గర బంధువు, వరుసగా తమ్ముడైన బూర్జ మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన పేడాడ రాజేష్, వానపల్లి అరుణ అనే యువతిని పరిచయం చేసుకొని ప్రేమ వివాహం చేసుకున్నట్టు మొబైల్‌లో ఉన్న ఫొటోలు చూపించాడు. 2024 నవంబరులో అక్క గొల్లపల్లి అనిత వద్ద రూ.10 లక్షల చిట్టీ కడతానని, అవసరాలు ఉన్నాయని, మొదటి చీటీ పాట తన భార్య అరుణ పేరున ఇవ్వాలని రాజేష్ తెలిపాడు. సరే అన్న అనిత మొదటి సేవింగ్స్ గ్రూప్‌లో రూ.లక్ష కట్టించుకొని గతేడాది అక్టోబరు 1వ తేదీన రూ.10 లక్షల చీటీకి గాను రూ.8 లక్షలు వానపల్లి అరుణ అకౌంట్‌లో జమ చేసింది. అనంతరం రాజేష్ మరికొంత సొమ్ము కావాలని చెప్పి దఫదఫాలుగా రూ.4 లక్షలు వాడుకున్నాడు. అయితే ఎన్నిసార్లు చిట్టీ డబ్బులు కట్టమని రాజేష్, అరుణలను అడిగితే.. రాజేష్‌కు డబ్బు ఇచ్చేశానని, అరుణకే ఇచ్చానని రాజేష్ చెబుతున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన గొల్లపల్లి అనిత శ్రీకాకుళం టూటౌన్ పోలీసులను ఆశ్ర యించింది. రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు విచారణ చేపట్టి చిట్టీ పాడుకొని డబ్బులు కట్టకపోవడంతో పేడా డ రాజేష్, వానపల్లి అరుణపై చీటింగ్ కేసు నమోదు చేశారు. నిజానికి పేడాడ రాజేష్‌కు, వానపల్లి అరుణకు వివాహం కాలేదని, చిట్టీ డబ్బులు కాజేసేందుకు పన్నాగం పన్నినట్టు విచారణలో తేలిందని సీఐ ఈశ్వరరావు తెలిపారు.