కుట్ర ఫలించలే.. అరెస్టు తప్పలే
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:44 AM
Former Minister Seediri Appalaraju arrested వైసీపీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుట్ర ఫలించలేదు.. చివరకు తాను అరెస్టు కాకతప్పలేదు. కొడుకును తప్పించే క్రమంలో ఆ కేసులో తానూ ఇరుక్కుని పోయారు. చివరకు కొడుకుతో పాటు తానూ కటకటాలపాలయ్యారు. సంబంధమేలేని ఓ యువకుడి అరెస్టుకు కారణమయ్యారు. ఇద్దరు పోలీసులపై వేటు పడడానికి కూడా కారకుడయ్యారు.
కొడుకును తప్పించేందుకు యత్నించి తానూ ఇరుక్కుని..
ఎట్టకేలకు కటకటాల్లోకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
పలాసలోని స్వగృహంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుస్టేషన్‌కు తరలించే క్రమంలో వైసీపీ శ్రేణుల హల్చల్
దూసుకొస్తూ.. వాహనాన్ని అడ్డుకుంటూ ఓవరాక్షన్
శ్రీకాకుళం, జూలై 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుట్ర ఫలించలేదు.. చివరకు తాను అరెస్టు కాకతప్పలేదు. కొడుకును తప్పించే క్రమంలో ఆ కేసులో తానూ ఇరుక్కుని పోయారు. చివరకు కొడుకుతో పాటు తానూ కటకటాలపాలయ్యారు. సంబంధమేలేని ఓ యువకుడి అరెస్టుకు కారణమయ్యారు. ఇద్దరు పోలీసులపై వేటు పడడానికి కూడా కారకుడయ్యారు.
పలాసలో సీదిరి కుమారుడు ఈ నెల 10న బైక్ నడుపుతూ దానయ్య అనే గొర్రెల కాపరిని ఢీకొట్టి అతని మరణానికి కారణమయ్యారు. వెంటనే అప్పలరాజు తన అనుచరుడు సిద్ధార్థ త్యాడి బైక్ ప్రమాదం చేశాడని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని పురమాయించి కుట్ర పన్నారు. మధ్యవర్తులతో బాధిత కుటుంబానితో బేరం కుదుర్చుకునేందుకు యత్నించారు. కొంత సొమ్ము కూడా ఇచ్చారు. విషయాన్ని దాచిపెట్టి తానే కొడుకును ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అంతా సద్దుమణిగిపోయింది కదాని అనుకున్నారు. అయితే ఆతర్వాతే డామిట్ కథ అడ్డం తిరిగింది. కుట్ర బట్టబయలై పోయింది.
ఆంధ్రజ్యోతి కథనంతో బట్టబయలు
అప్పలరాజు కుమారుడే ప్రమాదానికి పాల్పడడం.. ఆతర్వాత అప్పలరాజు కుట్ర వ్యవహారంపై ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో వార్త ప్రచురితమవడంతో సంచలనమైంది. ఆ వెంటనే జిల్లా పోలీసులు తీగలాగితే డొకంంతా బయటికి వచ్చింది. అప్పటివరకు అప్పలరాజు పాత్ర లేదని వాదించినవారు సైతం ‘హమ్మ అప్పలరాజు.. కుమారుడ్ని కాపాడుకునేందుకు ఇంత పనిచేశావా..?’ అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆతర్వాత పోలీసుల దర్యాప్తులో అన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. సాంకేతిక సాక్ష్యాలు అవిడెన్స్‌లు స్వాధీనం చేసుకున్నాక అప్పలరాజు, ఆయన కుమారుడు ఆరవ్, సహకరించిన త్యాడిపైనా కేసులు నమోదు చేశారు. కుమారుడ్ని జైలుకు పంపేందుకు కూడా ఇష్టపడక.. అప్పలరాజు తనకున్న పరిచయాలతో నాట్ ఫిట్ ఫర్ రిమాండ్ నివేదిక ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అదికూడా కుదరలేదు. చివరకు పోలీసులు అరవ్‌ను, సిద్ధార్థ్‌ను రిమాండ్ నిమిత్తం జిల్లా జైలుకు తరలించారు. అప్పలరాజు మాత్రం తాను అరెస్ట్ కాకుండా పలాసలో ఉంటూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం యత్నించారు. అవి కూడా ఫలించలేదు. అంతవరకు అప్పలరాజు ఊసెత్తని పోలీసులు.. యాంటిసిపేటరీ రాదని నిర్ధారించుకుని బుధవారం రాత్రి అరెస్టు చేశారు.
సమయం అడిగి కుమారుడ్ని అప్పగించి ఉంటే..
తన కుమారుడు తొందరపాటులో ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబానికి అండగా ఉండటంతో పాటు కుమారుడ్ని కూడా చట్టానికి బద్దుడినై అప్పగిస్తానని, సమయం ఇవ్వాలని అభ్యర్థించి ఉంటే సీదిరి అప్పలరాజు గౌరవం పెరిగిఉండేదని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే రాజకీయంగా కలసివచ్చేదని చెబుతున్నారు. అలా చేయకుండా బాధిత కుటుంబాన్ని ఘటన రోజు రాత్రి మాట్లాడి.. తర్వాత పట్టించుకోకపోవడం.. విషయం తెలిసినా అడ్డగోలుగా మాజీముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సైతం వెనుకేసుకు రావడం.. వంటివాటిపై ప్రజల్లో కూడా అసహనం పెరిగింది. కేవలం సీదిరి అప్పలరాజు వల్లే ఈ విషయం మరింత పెద్దదయిందని ఆ పార్టీ కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
సీదిరి నిర్వాకంతో సీఐ, ఎస్‌ఐపై వేటు
కాశీబుగ్గ స్టేషన్‌కు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణకు ప్రజాప్రతినిధుల వద్ద మంచి అభిప్రాయమే ఉంది. కొన్ని నెలల క్రితం ఎస్‌ఐగా విధుల్లో చేరిన ఎం.సునీల్ కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటారని పేరుంది. కానీ సీదిరి నిర్వాకం వల్ల.. ఆ ఇద్దరు పోలీసులు ఆ ఇద్దరు పోలీసులపై వేటు పడిందన్న చర్చ సాగుతోంది. పోలీసు అధికారులు ఆ ఇద్దరినీ వీఆర్‌కు పంపి.. ఆతర్వాత సస్పెన్షన్ వేటు వేశారు. కాగా మాజీమంత్రి సీదిరి అప్పలరాజుపై దాదాపు 12 కేసులు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ కేసుతో.. పాత కేసులకు జీవం పోసినట్లయింది.
అప్పలరాజు అరెస్టు క్రమం ఇదీ..
పలాస/కాశీబుగ్గ, జూలై 22(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు సీదిరి అప్పలరాజును బుధవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ఆయన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి వాస్తవాలు దాచడంతో పాటు వ్యవస్థను తప్పుదోవ పట్టించినట్లు ఆయనపై అభియోగం మోపబడింది. ఈ మేరకు ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా సోంపేట జిల్లా కోర్టు బుధవారం మధ్యాహ్నం తిరస్కరించింది. దీంతో ఆయన అరెస్టు చేస్తారన్న సమాచారం వైసీపీ నాయకులకు ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.23 గంటలకు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, కాశీబుగ్గ డీఎస్పీ భవానితో కూడిన పోలీసు బృందం జీఎంఈ కాలనీలో ఉండే అప్పలరాజు నివాసానికి చేరుకుంది. కార్యకర్తలు ఆ ప్రాంతానికి రానీయకుండా గ ట్టి బందోబస్తు నిర్వహించారు. అప్పలరాజును అరెస్టు చేస్తారని వైసీపీ నాయకులు అక్కడకు చేరుకుని హంగామా చేశారు. 7 గంటలకు అరెస్టు చేసి పోలీసు వాహనంలో ఆయన్ను ఎక్కించారు. ఆయన వెంట భార్య శ్రీదేవి కూడా వస్తుండగా ఆమెను పోలీసులు అనుమతించలేదు. తీవ్రంగా రోదించడంతో ఆమెకు అనుమతి ఇచ్చారు. 7.23 గంటలకు కాశీబుగ్గ పోలీస్టేషన్‌కు అప్పలరాజును తరలించారు. ఆయన వెంట న్యాయవాది వి.బాలకృష్ణ కూడా స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్టేషన్‌కు వెళ్లే మూడు దారులన్నీ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు పేరాడ తిలక్, ఎర్ర చక్రవర్తి తదితరులు అక్కడకు వచ్చి తొలుత రోడ్డుపై భైటాయించి హంగామా చేశారు. కాశీబుగ్గ శ్రీనివాసలాడ్జి జంక్షన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకూ ర్యాలీ చేశారు. అనంతరం పోలీస్టేషన్‌కు చేరుకోవడానికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అప్పలరాజును అరెస్టు చేసి వాహనంలో తరలిస్తుండగా కూడా వైసీపీ కార్యకర్తలు హంగామా చేశారు. కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్ వద్దకు వాహనశ్రేణి చేరుకునేసరికి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఏఎస్పీ కేవీ రమణ వారిని నిలువరించారు. అనంతరం రోప్‌పార్టీ సాయంతో కట్టడి చేశారు.