Share News

పోటీ సరే.. పైసల్లేవ్‌!

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:27 AM

There is no money for election expenses! ఊరికి ఒక్కసారైనా సర్పంచ్‌ కావాలనే కల చాలామందికి ఉంటుంది. ప్రథమ పౌరుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో.. ఎన్నికల్లో పోటీ కోసం చాలామంది ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. కాగా.. సర్పంచ్‌ కావాలనే కల కళ్ల ముందు ఉన్నా.. ఎన్నికల ఖర్చులను చూసి అభ్యర్థులకు దడ మొదలవుతోంది.

పోటీ సరే.. పైసల్లేవ్‌!

  • సర్పంచ్‌ పదవిపై మోజుతో బరిలో పలువురు

  • ఎన్నికల ఖర్చుకు సరిపడా డబ్బులు లేక వెతలు

  • అప్పుల వేటలో కొంతమంది అభ్యర్థులు

  • భూములు, ఆభరణాలు కుదవపెట్టి రుణాలు

  • నరసన్నపేట/ హిరమండలం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఊరికి ఒక్కసారైనా సర్పంచ్‌ కావాలనే కల చాలామందికి ఉంటుంది. ప్రథమ పౌరుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో.. ఎన్నికల్లో పోటీ కోసం చాలామంది ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. కాగా.. సర్పంచ్‌ కావాలనే కల కళ్ల ముందు ఉన్నా.. ఎన్నికల ఖర్చులను చూసి అభ్యర్థులకు దడ మొదలవుతోంది. ప్రచారంలో ప్రత్యర్థికి దీటుగా ఉండాలంటే.. భారీగా ఖర్చు పెట్టాల్సిందే. వాల్‌పోస్టర్లు, బ్యానర్లు, ప్రచార వాహనాలు, రోజువారీ క్యాడర్‌ ఖర్చు, పోల్‌మేనేజ్‌మెంట్‌, వీటన్నింటికితోడు మందు, ముక్క, ఓటర్లకు తాయలాలు ఇలా ఎన్నికల వ్యయం తడిసిమోపెడు అవుతుంది. వెయ్యి ఓట్లలోపు ఉన్న గ్రామమైతే.. కనీసం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఖర్చువుతుందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. రెండువేల మంది ఓటర్లు ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులకు.. ఖర్చు కోసం సుమారు రూ.12 లక్షలు ఉండాల్సిందే. నరసన్నపేట, టెక్కలి, సోంపేట వంటి మేజర్‌ పంచాయితీల్లో సర్పంచ్‌ అభ్యర్థికి కనీసం రూ.కోటి వరకూ ఖర్చు అవుతుందని ప్రచారం సాగుతోంది. రెబల్స్‌ బెడద ఉన్నచోట మరింత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు డబ్బుల కోసం అప్పులబాట పడుతున్నారు. తెలిసినవారు, వ్యాపారుల దగ్గర వడ్డీకి అప్పు తెస్తున్నారు. కొంతమంది భూములు, బంగారు ఆభరణాలు కుదువపెట్టి అప్పు చేస్తున్నారు. ఆ డబ్బులతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

  • నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

  • జిల్లాలో 904 గ్రామ పంచాయతీలు, 8,638 వార్డుస్థానాలకు లకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో 448 సర్పంచ్‌ స్థానాలు, 4,248 వార్డు స్థానాలు మహిళలకు రిజర్వ్‌ చేశారు. మిగిలినవి కులాల వారీగా కేటాయించారు. చాలా మందికి రిజర్వేషన్లు కలిసిరాగా.. అనుకూలించనివారు తమ భార్య, తల్లీ, కుమార్తెను బరిలో దించుతున్నారు. తొలివిడత పలాస రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లోని 194 పంచాయతీల్లో ఈ నెల 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో పూర్తయింది. వాటిని అధికారులు పరిశీలించనున్నారు. 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు అభ్యర్థుల తుదిజాబితాను అధికారులు ప్రకటిస్తారు. 26న ఎన్నిక నిర్వహించి.. అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడత కూడా 13 మండలాల్లోని పంచాయతీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పల్లెలో రాజకీయం మరింత వేడెక్కింది. ఎక్కడ చూసినా అభ్యర్థులు, ఆశావహుల వెంట అనుచరుల సందడి కనిపిస్తోంది. ప్రచారం హోరెత్తుతోంది.

  • పార్టీ మద్దతు కోసం ఆరాటం

  • పంచాయతీ ఎన్నికల్లో పలువురు పార్టీ మద్దతుతో బరిలో ఉంటున్నప్పటికీ బ్యాలెట్‌పై పార్టీ గుర్తు మాత్రం ఉండదు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన గుర్తులే ఉంటాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు మద్దతిస్తారా? అనే అనుమానం కూడా ఆశావాహుల్లో నెలకొంది. గత ఎన్నికల్లో అధిష్ఠానం అభ్యర్థులకు ఎంతో కొంత ఇచ్చి గెలిపించింది. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు. దీంతో అభ్యర్థులు సొంత డబ్బులతో బరిలో దిగాల్సి వస్తోంది.

  • ప్రతీ పైసాకు పక్కాగా లెక్క!

  • ఎన్నికల కమిషన్‌ అభ్యర్థులకు వ్యయ పరిమితిని పెంచింది. గత ఎన్నికల్లో జనాభా ఆధారంగా 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పోటీ చేసే సర్పంచి అభ్యర్థులు రూ.1.5లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేల లోపు ఖర్చు చేసారు. ప్రస్తుతం 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీకు రూ.2.5లక్షలు ఖర్చు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వార్డు సభ్యులు రూ.60వేలు దాటకుండా చూసుకోవాలి. 10వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీ అయితే సర్పంచి అభ్యర్థి రూ.4లక్షలు, వార్డు సభ్యులు రూ.లక్ష వరకు ఖర్చు చేయవచ్చు. ఇంతకుమించి ఖర్చు చేస్తే ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతీ పైసాను ఖచ్చితంగా లెక్క చూపించాలని ఇప్పటికే సూచించింది. ఖర్చుల లెక్కలు రిటర్నింగ్‌ అధికారులకు తెలపాల్సిందే. దీంతో చాలాచోట్ల సర్పంచ్‌ అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి ఎన్నికల్లో గట్టెక్కే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 18 , 2026 | 12:27 AM