Share News

పాత్రధారులు సరే.. సూత్రధారులు ఏరీ?

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:28 AM

Criticism of the police department ఏదైనా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు లోతైన దర్యాప్తు చేయాలి. కేవలం పాత్రధారులను మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవాలి. కేసు మూలాలను కనుగొని అందుకు కారణమైన వారిని అరెస్టు చేయాలి. అప్పుడే నేరాలు నియంత్రించవచ్చు. శాంతిభద్రతలను పరిరక్షించవచ్చు. కానీ జిల్లా పోలీసుశాఖలో కొంతమంది తీరు అందుకు భిన్నంగా ఉంది.

పాత్రధారులు సరే.. సూత్రధారులు ఏరీ?
నకిలీ పాస్‌లు (ఫైల్‌)

  • నీరుగారుతున్న కేసులు!

  • ప్రారంభంలో హడావుడి

  • రోజులు గడిచేకొద్ది పక్కదారి

  • జిల్లా పోలీస్‌శాఖపై విమర్శలు

  • శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఏదైనా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు లోతైన దర్యాప్తు చేయాలి. కేవలం పాత్రధారులను మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవాలి. కేసు మూలాలను కనుగొని అందుకు కారణమైన వారిని అరెస్టు చేయాలి. అప్పుడే నేరాలు నియంత్రించవచ్చు. శాంతిభద్రతలను పరిరక్షించవచ్చు. కానీ జిల్లా పోలీసుశాఖలో కొంతమంది తీరు అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా రెండు కేసుల విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం అనుమానాలకు తావిస్తోంది.

  • దొంగపాసులు సృష్టిస్తే..

  • జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లి ఆలయానికి విదేశాల్లో ఉన్న భక్తులు సైతం తరలివచ్చి సూర్యనారాయణస్వామిని దర్శించుకుంటారు. రథసప్తమి రోజు భక్తుల తాకిడి లక్షల్లో ఉంటుంది. కాగా.. ఈ ఏడాది రథసప్తమి ఉత్సవాల్లో నకిలీ పాస్‌ల వ్యవహారం.. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేసింది. ఈ ఏడాది జనవరి 19 నుంచి 26 వరకు రాష్ట్రపండుగగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహించారు. జిల్లా అధికారుల నేతృత్వంలో శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జనవరి 24న ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజికల్‌ షో నిర్వహించారు. ఈ షోకు వీఐపీ, వీవీఐపీ పాస్‌లను అధికారులు ముద్రించారు. కాగా.. స్వామి దర్శనంతోపాటు వేడుకలకు సంబంధించి వీఐపీ, వీవీఐపీల పాస్‌లను కొంతమంది నకిలీమయం చేశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చారు. దీనిపై ఎస్పీ మహేశ్వరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌తోపాటు సీసీఎస్‌ పోలీసులు సవాల్‌గా తీసుకొని దర్యాప్తు చేశారు. కొన్నాళ్ల కిందట 12 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కానీ మూడు నెలలు తిరగకముందే సీన్‌ మారింది. సీరియస్‌ కేసు కాస్త నీరుగారిపోయింది. మొక్కుబడి తంతుగా ఇటీవల ఈ నెల 17న ఓ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో అసలైన సూత్రదారులు తప్పించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • లాటరీ టిక్కెట్ల మాయాజాలం...

  • జిల్లాలో గుట్టుచప్పుడుకాకుండా లాటరీ వ్యవహారం జోరుగా సాగుతోంది. అమాయక ప్రజలకు రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ ఆశచూపి, వారి జేబులకు చిల్లులు పొడుస్తున్న ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే సాగుతున్నా పోలీసుల చర్యలు లేవు. దీనిపై ఈ నెల 1న ‘రూ.లక్షలంటారు.. దోచేస్తారు!’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై పోలీసులు స్పందించారు. శ్రీకాకుళం నగరంలో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తున్న వారిని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఆధార్‌కార్డులతో పాటు ఫొటోలను తీసుకొని హడావుడి చేశారు. తప్పకుండా దీని మూలాలను వెతికి లాటరీ టిక్కెట్లు దోపిడీని అరికడతారని అంతా భావించారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఎటువంటి కేసు లేదట. పట్టుకున్న వారిని విడిచిపెట్టేశారట. ఎస్పీ సీరియస్‌గా ఆదేశాలు జారీ చేస్తారు. కానీ కిందిస్థాయి పోలీస్‌ అధికారులు, సిబ్బంది మాత్రం సీరియస్‌గా తీసుకోరు. పాత్రదారులను పట్టుకుంటారు. వారిచ్చే సమాచారంతో సూత్రదారులపై దృష్టి పెడతారు. కానీ మన జిల్లాలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిని వదిలేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. లాటరీ టిక్కెట్లు వ్యవహారంలో పాత్రదారులైన ఐదుగురిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కానీ ఇంకా అసలైన సూత్రదారులు తప్పించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసుశాఖలో కొంతమంది తీరుతో కేసులు నీరుగారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జిల్లా పోలీస్‌బాస్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 27 , 2026 | 12:28 AM