Share News

కేంద్రం ఆడిట్‌ అధికారినంటూ కోటికి పైగా కొట్టేశాడు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:23 AM

: తాను కేంద్ర ప్రభుత్వ ఆడిట్‌ అధికారినంటూ నమ్మించాడు. బ్యాంకుల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఇప్పిస్తానంటూ వల వేశాడు.

కేంద్రం ఆడిట్‌ అధికారినంటూ కోటికి పైగా కొట్టేశాడు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వివేకానంద

-నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లతో బురిడీ

-ఇంటి యజమానికి స్థలం ఇప్పిస్తానని..

-నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

శ్రీకాకుళం క్రైం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): తాను కేంద్ర ప్రభుత్వ ఆడిట్‌ అధికారినంటూ నమ్మించాడు. బ్యాంకుల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఇప్పిస్తానంటూ వల వేశాడు. వేలానికి వచ్చే స్థలాలను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించాడు. వ్యవహారం బయటపడడంతో మూడేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. చివరకు శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు దొరికిపోయాడు. శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద ఈ కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఓవ్వేరు గ్రామానికి చెందిన గొల్లబెనర్జీ అలియాస్‌ హర్షవర్ధన్‌రెడ్డి (33) సీఏ మధ్యలో మానేశాడు. దీంతో అకౌంట్స్‌పై కొంత పరిజ్ఞానం సంపాదించాడు. నెల్లూరులో తొలి వివాహం చేసుకుని, భార్యాపిల్లలను వదిలేశాడు. అనంతరం గార మండలం సతివాడకు చెందిన యువతిని రెండో వివాహం చేసుకుని అరసవల్లిలో అద్దెకు దిగాడు. తాను ఢిల్లీలో సెంట్రల్‌ జోనల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ విశాఖకు బదిలీపై వచ్చానని ఇంటి యజమాని దేశెట్టి రమణమూర్తిని నమ్మించాడు. ఆతర్వాత బ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులో తనకు సభ్యత్వం ఉందంటూ.. పీవో, క్లర్క్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్థానికులను నమ్మించాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.6 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లిస్తే ఉద్యోగం మీదేనన్నాడు. చుట్టుపక్కల వారి నుంచి రూ.36 లక్షల దాకా వసూలు చేశాడు. వారికి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చి మోసగించాడు. శ్రీకాకుళం చిన్నబజార్‌ రోడ్డులో వేలానికి వస్తున్న 8 సెంట్ల స్థలాన్ని తనకున్న పరిచయాలతో తక్కువ ధరకు ఇప్పిస్తానని ఇంటి యజమాని రమణమూర్తి నుంచి ఏకంగా రూ.86 లక్షలు కాజేశాడు. అంతేకాకుండా రూ.29 లక్షల విలువ చేసే గోల్డ్‌ క్రాఫ్ట్‌ మెషిషన్‌ను రూ.14 లక్షలకే ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ముఖం చాటేశాడు.

సీఐడీ ఎంట్రీతో కదిలిన డొంక..

మోసపోయానని గ్రహించిన రమణమూర్తి మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో 15 రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన విశాఖపట్నం సీఐడీ అధికారులు నివేదికను డీజీకి సమర్పించారు. డీజీ తదుపరి చర్యలు కోసం ఫిర్యాదును శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి పంపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ కె.పైడపునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పక్కా సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం నిందితుడు గొల్ల బెనర్జీని అరెస్టు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా బాధితులే..

నిందితుడు విశాఖలో 8 మందిని, తిరుపతిలో ముగ్గురిని, నెల్లూరు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పలువురిని మోసం చేసి మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇతనిపై నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో రెండు చీటింగ్‌ కేసులు, ఒక కొట్లాట కేసు, ఏఎస్‌పేటలో ఒకచీటింగ్‌ కేసు, తాడేపల్లిగూడెం, తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో పలు చీటింగ్‌ కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Updated Date - Mar 11 , 2026 | 12:23 AM