జనగణన పక్కా!
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:16 AM
census survey జిల్లాలో జనగణనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 31 వరకూ మొదటి విడత లెక్కింపు ఉంటుంది. దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో జనగణన కీలకం. అందుకే ప్రజలంతా భాగస్వామ్యం అయ్యేలా.. అన్ని కుటుంబాల వివరాలను సేకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి స్వీయ నమోదుకు అవకాశం
మొత్తం బ్లాకులు 3,586
4,073 మందితో ప్రక్రియ
తహసీల్దార్లు, కమిషనర్లకు పర్యవేక్షణ బాధ్యత
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనగణనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 31 వరకూ మొదటి విడత లెక్కింపు ఉంటుంది. దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో జనగణన కీలకం. అందుకే ప్రజలంతా భాగస్వామ్యం అయ్యేలా.. అన్ని కుటుంబాల వివరాలను సేకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 24,97,219 మంది. ప్రతి పదేళ్లకోసారి అంటే.. 2021లో జనగణన జరగాలి. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా అప్పట్లో జనగణన జరగలేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.
శిక్షణ పూర్తి
జనగణన కోసం అధికారులు బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కో బ్లాక్‌లో 800 ఇళ్లు ఉండేలా హెచ్‌ఎల్‌బీలను సిద్ధం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జనగణన చేయనున్నారు. మండలాల పరిధిలో తహసీల్దార్లు, మునిసిపాలిటీల పరిధిలో కమిషనర్లు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశారు. జిల్లాలో 3,586 బ్లాక్‌లను విభజించి గణన మొదలు పెట్టనున్నారు. 4,073 మంది అధికారులు, సిబ్బంది ఈ గణనలో పాల్గొనున్నారు.
సొంతంగా ఇలా..
అధికారులు ఇంటింటికీ వెళ్లి జనగణన చేపట్టనున్నారు. వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. తొలిదశలో 33 ప్రశ్నలు అడుగుతారు. అయితే తొలిసారిగా స్వీయగణనకు అవకాశం ఇచ్చారు. హెచ్‌టీటీపీఎస్://ఎస్‌ఈ.సీఈఎన్‌ఎస్‌యూఎస్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. కుటుంబ పెద్ద పేరు, సెల్‌ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీని నమోదుచేస్తే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేయగానే అక్కడ ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలు ఇవ్వాలి. 11 అంకెలతో కూడిన ఐడీ వస్తుంది. దానిని భద్రపరుచుకొని జనగణన చేపట్టే సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీని ఇవ్వాలి. స్వయంగా నమోదుచేసుకున్న వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే వెసులబాటు కూడా ఉంది. మే 1 నుంచి జనగణన మొదలవుతుంది. కానీ మే 16 నుంచి మాత్రమే స్వీయగణనకు అవకాశమిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
జనగణనకు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఇప్పటికే పర్యవేక్షకుల శిక్షణ తొలివిడత పూర్తయింది. రెండో విడత ఈ నెల 21, 22, 23 మూడు రోజులు పాటు జరగనుంది. గణకులకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలిసారి సొంతంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గణకులకు సరైన వివరాలు అందించాలి.
- ఎన్.రమేష్, మునిసిపల్ కమిషనర్, ఇచ్ఛాపురం