Share News

ప్రభుత్వ బడి జోష్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:06 AM

Highly educated people are enrolling their children కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధన, సదుపాయాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు.

ప్రభుత్వ బడి జోష్‌
నరసన్నపేట: బోర్డు ఆదర్శ పాఠశాలలో కుమారుడ్ని చేర్పించిన దంతవైద్యుడు సాగర్‌

  • జిల్లాలో పెరుగుతున్న ప్రవేశాలు

  • పిల్లలను చేర్పిస్తున్న ఉన్నత విద్యావంతులు

  • ఆదర్శ పాఠశాలలో చేరిన వైద్యుడి కుమారుడు

  • ప్రైవేటు నుంచి సర్కారు స్కూలుకు ఉపాధ్యాయుల పిల్లలు

  • నరసన్నపేట/ మెళియాపుట్టి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధన, సదుపాయాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. పలువురు ఉపాధ్యాయులు, వైద్యులు, ఉన్నత విద్యావంతులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

  • నరసన్నపేటలోని బోర్డు ఆదర్శ పాఠశాలలో ఈ ఏడాది 40 మందికిపైగా విద్యార్థులు చేరారు. ఇందులో ఉన్నత విద్యావంతుల పిల్లలు కూడా.. సర్కారు బడులపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ఈ పాఠశాలలో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు జి.పూజ భరద్వాజ్‌ తన కుమార్తె శిమ్మ అధ్యానిహాన్‌ను ఒకటో తరగతిలో చేర్పించారు. అలాగే పట్టణానికి చెందిన దంత వైద్యుడు సాగర్‌ తన కుమారుడు బెలుమాన సత్యత్‌ను ఒకటో తరగతిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడి లేని చదువులు, నైతిక విలువలతో కూడిన బోధన ఉంటుందని, అందుకే తన కుమారిడిని చేర్పించానని దంతవైద్యుడు సాగర్‌ తెలిపారు. అలాగే ఉన్నతపాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు యాళ్ల అప్పలనాయుడు తన కుమార్తె జ్యోష్మిత్మై ప్రైవేటు పాఠశాలల నుంచి మూడోతరగతిలో చేర్పించారు. ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా చేస్తున్న వంశీకృష్ణ తన కుమార్తె దీర్ఘాశి శ్రీవికను ఒకటో తరగతిలో చేర్పించారు. అడ్మిషన్‌ ధ్రువీకరణ పత్రాలను హెచ్‌ఎం ఆర్‌ఎస్‌ఎస్‌ నాయుడుకు అందజేశారు.

  • మెళియాపుట్టి మండలంలో సీది నరేంద్ర అనే ఉపాధ్యాయుడు తన కుమారుడు గగ్నేష్‌ను డబార్‌ మండల పరిషత్‌ పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించారు. నరేంద్ర మెళియాపుట్టి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన కుమారుడు గగ్నేష్‌ను గతేడాది మెళియాపుట్టిలో ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదివించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడింది. ముందు తమ నుంచే మార్పు మొదలవ్వాలనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న కుమారుడ్ని ప్రభుత్వ బడిలో చేర్చానని ఉపాధ్యాయుడు నరేంద్ర తెలిపారు.

Updated Date - Jun 19 , 2026 | 12:06 AM