Share News

ఆశావహుల్లో సందడి

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:18 AM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈసారి కొత్తగా నాలుగు వార్డులు వచ్చి చేరాయి. మొత్తం 36 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఆశావహుల్లో సందడి
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ

- పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 36కు పెరిగిన వార్డులు

- కొత్తగా నాలుగు చేరిక

- శాసనం, ఎన్టీఆర్‌ గృహసముదాయం, ఏహెచ్‌పీ గృహాలపై తేలని పంచాయితీ

- గ్రేడ్‌-1 మున్సిపాలిటీగా అవతరించే అవకాశం

పలాస, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈసారి కొత్తగా నాలుగు వార్డులు వచ్చి చేరాయి. మొత్తం 36 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు పెరగడంతో ఆశావాహుల్లో సందడి నెలకొంది. మున్సిపాలిటీకి సమీపంలో ఉండే శాసనం పంచాయతీతో పాటు ఎన్టీయార్‌ గృహ సముదాయం (కోసంగిపురం రోడ్డు), ఏహెచ్‌పీ గృహ సుముదాయం ప్రాంతాలపై ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. వీటిల్లో మొత్తం మున్సిపాలిటీకి చెందిన ఓటర్లే ఉండడంతో ఆయా ప్రాంతాలపై తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే పలాస-కాశీబుగ్గ గ్రేడ్‌-1 మున్సిపాలిటీగా అవతరించడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.

కొత్తగా నాలుగు వార్డులు..

మున్సిపాలిటీలో గతంలో 32 వార్డులు ఉండేవి. పరిపాలన సౌలభ్యం, వార్డుల విభజన తరువాత అదనంగా నాలుగు వార్డులను పెంచుతూ మొత్తం 36 వార్డులను చేసి హద్దులు నిర్ణయించారు. కొత్తగా కోసంగిపురం, పాయకరామ్‌పురం, వెంకటేశ్వరకాలనీ వార్డులతో పాటు ఇందిరానగర్‌, సూదికొండకాలనీ కలిసి ఒక వార్డుగా ఏర్పడింది. గతంలో ఇరు పార్టీల్లోనూ టిక్కెట్లు ఆశించి వేరు కుంపటి పెట్టిన నాయకులకు కొత్తగా ఏర్పడిన నాలుగు వార్డులతో అవకాశాలు లభించనున్నాయి.

వాటిని ఏం చేస్తారో?

పట్టణానికి ఆనుకొని ఉన్న శాసనం వాస్తవానికి మున్సిపాలిటీలో విలీనం కావాల్సి ఉంది. అప్పట్లో ప్రజాప్రతినిధుల నుంచి సుముఖత వ్యక్తం కావడంతో దీన్ని లొద్దబధ్ర పంచాయతీలోనే ఉంచారు. గత ఎన్నికల్లో మున్సిపాలిటీలో చేరుతుందని భావించి అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇటీవల శాసనం గ్రామస్థులంతా తమను మున్సిపాలిటీలో విలీనం చేసినా ఇబ్బందులు లేవని లేఖలు ఇచ్చారు. అయితే, అప్పటికే 36 వార్డుల ముసాయిదా పూర్తి కావడంతో ఈ పంచాయతీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అదేవిధంగా కొత్తగా కోసంగిపురం రోడ్డులో ఏర్పాటయిన ఎన్టీఆర్‌ గృహ సముదాయం కూడా మున్సిపాలిటీలో విలీనం చేయాల్సి ఉంది. అక్కడ 3వేలకు పైగా గృహాలు ఉండడంతో ఏకంగా రెండు వార్డులను చేయడానికి అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించకపోవడంతో వారు పంచాయతీలో ఉన్నారా, మున్సిపాలిటి పరిధిలోకి వస్తారో ఇంకా స్పష్టత లేదు. ఏహెచ్‌పీ గృహసముదాయం కూడా పూర్తిగా పురపాలక పరిధిలోకి రావాల్సి ఉంది. మున్సిపాలిటీకి చెందిన వారికే ఇక్కడ మొత్తం గృహాలు కేటాయించారు. దీంతో ఆ ప్రాంతం మున్సిపాలిటీకి చెందిందే. కానీ, దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ మూడు ప్రాంతాలు విలీనం జరిగితే కొత్తగా మరో నాలుగు వార్డులు పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Aug 27 , 2026 | 12:18 AM