ముంచుకొస్తున్న ‘ఆర్నబ్’
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:28 AM
Cyclone threat to the srikakulam జిల్లాకు ఆర్నబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆర్నాబ్’.. తీవ్ర తుఫాన్‌గా మారి బుధవారం ఉదయం బాపట్ల - విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ వెల్లడించాయి.
జిల్లాకు తుఫాన్ ముప్పు
అప్రమత్తమైన అధికారులు
తీరప్రాంత గ్రామాల్లో పర్యటన
సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిక
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
శ్రీకాకుళం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ఆర్నబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆర్నాబ్’.. తీవ్ర తుఫాన్‌గా మారి బుధవారం ఉదయం బాపట్ల - విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ వెల్లడించాయి. రణస్థలం మండలం నుంచి కవిటి మండలం వరకు సముద్రతీరంలో 2.9 నుంచి 3.5 మీటర్ల ఎత్తులో భారీ రాకాసి అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని ‘హై వేవ్’ అలర్ట్ జారీ అయ్యింది. ఈ తీర ప్రాంతంలో సముద్ర ఉపరితల ప్రవాహ వేగం సెకనుకు 1.2 నుంచి 1.7 మీటర్ల మేర ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.. జిల్లా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి.. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు పటిష్ఠ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేశారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు స్పష్టం చేశారు. పడవలు, వలలు సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచాలని సూచించారు. సహాయక చర్యల నిమిత్తం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ (08942 - 240557) ఏర్పాటు చేశారు.
తీరప్రాంతాల్లో అలజడి
సోమవారం జిల్లాలోని తీరప్రాంతంలో అలజడి ఆరంభమైంది. కుందువానిపేట, పీజీవానిపేట తదితర తీరప్రాంతాల్లో పెద్దఎత్తున కెరటాలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం కొన్నిమీటర్ల ముందుకు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీరప్రాంత గ్రామాల్లో సోమవారం రెవెన్యూ అధికారులు పర్యటించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా అరటి, బొప్పాయి, మునగ, తాటి, కొబ్బరి చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఉద్దానం ప్రాంత రైతులు ఈ తుఫాన్ ఎటువంటి నష్టాన్ని మిగుల్చుతుందోనని కలవరపడుతున్నారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
ఆర్నబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, నిర్వాహకులు ఈ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి ఐదు రోజులపాటు సెలవులను రిజిస్ర్టార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య ప్రకటించారు. ఈ నెల 27 నుంచి 31 వరకు సెలవులని, వసతిగృహాలను చీఫ్ వార్డెన్, వార్డెన్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ముందస్తు చర్యలకు రూ.కోటి మంజూరు
తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ, సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.కోటి తక్షణ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను కలెక్టర్ తక్షణమే వినియోగించుకునేందుకు అనుమతించింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలి. పునరావాస కేంద్రాల కోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను వినియోగించుకోవాలి. బాధితులకు సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. రోడ్లపై పడిపోయే చెట్లను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల సాయంతో వెంటనే తొలగించాలి. దెబ్బతిన్న రోడ్లు, సాగునీటి వసతులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి. ఈ నిధులను అత్యవసరాలకు మాత్రమే ఖర్చు చేసి 30రోజుల్లోగా అకౌంటెంట్ జనరల్‌కు బిల్లులు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అమరావతి నుంచి సీఎం చంద్రబాబునాయుడు.. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్ పాల్గొన్నారు.