Share News

ప్రత్యామ్నాయమే మేలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:29 AM

El Nino is scaring farmers ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కాలువలు నీరు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎల్‌నినో బలపడే అవకాశం ఉందని, ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కానుందని ఐఎండీ హెచ్చరిస్తోంది.

ప్రత్యామ్నాయమే మేలు

  • రైతులను భయపెడుతున్న ఎల్‌నినో

  • లోటు వర్షపాతం ఉంటుందంటున్న ఐఎండీ

  • తక్కువ కాలం పంటలు వేసుకుంటే మంచిది

  • తద్వారా మంచి ఆదాయం పొందవచ్చు

  • వ్యవసాయశాఖ అధికారుల సూచనలు

  • టెక్కలి మండలం జగన్నాఽథపురానికి చెందిన ముదిలి పెంటయ్య సుమారు మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి పండించేవారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయశాఖ అధికారుల సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు.

  • మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన నడిమింటి సోమేశ్వరావు 15 ఎకరాల వరకు వరిసాగు చేసేవారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా.. తక్కువ నీటితో పండే వేరుశనగ, నువ్వుల వంటి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.

  • టెక్కలి రూరల్‌, జూన్‌ 4(అంధ్రజ్యోతి): ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కాలువలు నీరు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎల్‌నినో బలపడే అవకాశం ఉందని, ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కానుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు పెరగనున్నాయని, సాగునీటి కొరతతో పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది చివర్లో సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడవచ్చని కొన్ని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిసాగు చేస్తే తమకు నష్టాలు తప్పవని వాపోతున్నారు. వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల వైపు దృష్టి సారించేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. తక్కువ నీటితో పండే వేరుశనగ, నువ్వుల వంటి పంటల సాగు చేయాలని సూచిస్తున్నారు.

  • ఇదీ పరిస్థితి

  • జిల్లాలో ఏటా 3.67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. 20,627 ఎకరాల్లో మొక్కజొన్న, 2,115 ఎకరాల్లో పత్తి, 1501 ఎకరాల్లో ఇతర పంటలు, 91వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న వేళ.. ఎల్‌నినో పరిస్థితులు రైతులను కలవర పెడుతున్నాయి. ఏటా జూన్‌ రెండో వారం తర్వాత వర్షాలు కురుస్తుంటాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జూలై మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విత్తనాలు ఆలస్యంగా వేయాలని వ్యవసాయాశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. జిల్లాకు లక్ష క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా.. ఇప్పటివరకు 32వేల క్వింటాళ్లు రైతుసేవా కేంద్రాల్లో నిల్వ చేశారు. త్వరలో వీటిని పంపిణీ చేయనున్నారు.

  • విత్తన గుళికల రూపంలో..

  • ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ముందుగానే రైతులకు అవగాహన కల్పించి 30 రకాలు చిరుధాన్యాలు అందజేయనున్నారు. పీఎండీఎస్‌ పథకం ద్వారా ఎకరాకు 15 కిలోల విత్తనాలు గులికల రూపంలో అందిస్తారు. ఈ విత్తనాలు వేయటం వల్ల మొక్కలు పెరిగి భూమికి సారవంతంతోపాటు ఎండ తగలకుండా కాపాడుతుందని అధికారులు తెలిపారు. గుళికల రూపంలో ఉన్న విత్తనాలు వేయడం వల్ల వర్షాలు లేకపోయినా.. భూమిలో రెండు, మూడు నెలలపాటు వేడికి తట్టుకునే సామర్థ్యం ఉంటుందన్నారు. వర్షం పడితే.. ఈ విత్తనాలకు మొలకలు వస్తాయని చెబుతున్నారు.

  • తక్కువ కాలం పంటలు వేసుకోవాలి

  • ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే పరిస్థితి ఉంది. దీంతో రైతులు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు సాగుచేస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఆకుకూరలు, కూరగాయలు, పూలతోటలు వంటివి. అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కొన్ని రకాల ఉద్యాన పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఉదాహరణకు వెదురు, ఆయిల్‌ఫామ్‌ వంటివి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు పద్ధతులు మార్చుకోవాలి. అప్పుడే గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. మంచి ఆదాయం కూడా పొందుతారు.

    - దుక్క శరత్‌రెడ్డి, ఉద్యాన సహాయకులు, పాతపట్నం

Updated Date - Jun 05 , 2026 | 12:29 AM