Share News

కార్యకర్తను నాయకుడిని చేయడమే కూటమి ఆశయం

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:11 AM

‘కార్యకర్త ఎప్పటికీ కార్యకర్తగానే ఉండాలన్నది వైసీపీ నినాదం. కార్యకర్తను నాయకుడిని చేయడమే కూటమి ఆశయం.’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

కార్యకర్తను నాయకుడిని చేయడమే కూటమి ఆశయం
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి మనోహర్‌, శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్‌, మేయర్‌ అభ్యర్థి రాధారాణి

- నగరాభివృద్ధి కోసమే ఈ ఎన్నికలు

- మీ ఓటు వృథా కాకూడదు

- కూటమి విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

- కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

- మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి శ్రీకాకుళంలో ప్రచారం

శ్రీకాకుళం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘కార్యకర్త ఎప్పటికీ కార్యకర్తగానే ఉండాలన్నది వైసీపీ నినాదం. కార్యకర్తను నాయకుడిని చేయడమే కూటమి ఆశయం.’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో పలు వార్డుల్లో రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, కూటమి మేయర్‌ అభ్యర్థిని దానేటి రాధారాణితో కలసి ఆయన విస్త్రృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. 16 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం నగరంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ‘ఇప్పటివరకు కార్యకర్తలంతా ఎంతో కష్టపడి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపిస్తున్నారు. వారు మాత్రం కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు. కార్యకర్తలను కూడా కార్పొరేటర్లగా, నాయకులుగా చూడాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్యే శంకర్‌ రెండేళ్లుగా కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు ఎంతో శ్రమించారు. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. రాష్ట్ర అభివృద్ధి కూటమి మంత్రంగా ముందుకు సాగుతుంటే, దానిని అడ్డుకోవడమే వైసీపీ తంత్రంగా వ్యవహరిస్తోంది. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన అందుతోంది. అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నాం. ఈ ఎన్నికలు ఆత్మగౌరవం కోసమో, కక్షల కోసమో జరుగుతున్నవి కావు. శ్రీకాకుళం నగర అభివృద్ధి కోసం జరుగుతున్నవి. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నవారిని ఆదరించాలో, లేక ఎన్నికలను అడ్డుకుని ఇప్పుడు పదవుల కోసం వస్తున్న వారిని ఆదరించాలో చైతన్యవంతులైన సిక్కోలు ప్రజలు ఆలోచించుకోవాలి. ఓటు వృథా కాకూడదు. అది అభివృద్ధికి అడ్రస్‌ కావాలి. కేంద్రంలో, రాష్ట్రంలో, స్థానికంగా కూటమి ప్రభుత్వం ఉంటేనే ప్రజలు కోరుకున్న అభివృద్ధి అందుతుంది. వైసీపీది పదవీ వ్యామోహం తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు. కూటమి అభ్యర్థుల గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.’ అని పిలుపునిచ్చారు.

వైసీపీ గోబెల్స్‌ ప్రచారాలను నమ్మొద్దు: నాదెండ్ల

మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. కూటమి మేయర్‌ అభ్యర్థిని, డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ సతీమణి రాధారాణిని గెలిపించుకోవాల్సిన అవసరం విజ్ఞులైన శ్రీకాకుళం ప్రజలకు ఎంతైనా ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న డాక్టర్‌ దానేటి శ్రీధర్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. వైసీపీ నాయకులు చెప్పే మాయమాటలను నమ్మవద్దని, గోబెల్స్‌ ప్రచారాలు చేయడంలో వారు దిట్ట అని విమర్శించారు. ఈ ప్రచారంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి, వంశీకృష్ణ, నాయకులు డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్‌, కూటమి అభ్యర్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీకాకుళాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం

శ్రీకాకుళాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ‘జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచే శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. ముఖ్యంగా ఉద్దానం సమస్యలు, మత్స్యకారుల వలసలపై పవన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ‘పల్లెపండుగ’ పేరుతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. శ్రీకాకుళం కార్పొరేషన్‌పై పవన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ‘శ్రీ-7’ కాన్సెప్ట్‌తో ముందుకెళ్తున్నాం. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిర్మాణంపై కూటమి పెద్దలు దృష్టి సారించారు. మేము రాజకీయ కక్షలతో పనిచేయబోము. మా పార్టీ మేయర్‌ అభ్యర్థి దానేటి రాధారాణిని గెలిపించుకునేందుకు మూడు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. కూటమి పొత్తుల కారణంగా కొందరికి టికెట్లు ఇవ్వలేకపోతున్నాం. అయినప్పటికీ జనసేన నేతలకు ఎప్పుడూ అండగా ఉంటాం.’అని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి, వంశీకృష్ణ, డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, జిల్లా జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 12:11 AM