Share News

300 యూనిట్లు దాటితే అంతే!

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:19 AM

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు మాత్రమే కాదు దాదాపు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ విద్యుత్‌ వినియోగంతో ముడిపడినవే.

300 యూనిట్లు దాటితే అంతే!

- ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు

- జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు

- అనవసర వినియోగాన్ని తగ్గించాలని సూచన

గత ఏడాది జూన్‌లో తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. అప్పట్లో నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం దాటిన వేలాది మంది ఈ పథకానికి దూరమయ్యారు. దానికి కారణం ఆ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌లో వచ్చిన విద్యుత్‌ బిల్లులే. అదే పరిస్థితి అన్నదాత సుఖీభవ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కొందరికి ఎదురైంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని అధికారులు అంటున్నారు.

============

రణస్థలం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు మాత్రమే కాదు దాదాపు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ విద్యుత్‌ వినియోగంతో ముడిపడినవే. అందుకే ఈ వేసవిలో విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, యుద్ధ ప్రభావంతో నెలకొన్న గ్యాస్‌ సంక్షోభంతో ప్రతి ఇంట్లో ఎలక్ట్రికల్‌ గ్యాస్‌ స్టవ్‌లు, ఇంజక్షన్‌ స్టవ్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో విద్యుత్‌ బిల్లులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇంధన సామర్ధ్య విభాగం (బీఈఈ) నిర్దేశించిన విద్యుత్‌ పరికరాలు వినియోగిస్తే మాత్రం కొంతవరకూ వృథా వినియోగాన్ని నియంత్రించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఒక యూనిట్‌ వినియోగంతో శ్లాబు రేటులే మారి విద్యుత్‌ భారం పడిపోతుందని హెచ్చరిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి విద్యుత్‌ శాఖ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 6.81 లక్షల గృహ వినియోగ విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి. 67,867 వాణిజ్య అవసరాలకు సంబంధించి మీటర్లు ఉన్నాయి. వేసవిలో జిల్లాలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఇతర రాయితీలకు విద్యుత్‌ వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకుంటోంది. 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం దాటితే ‘తల్లికి వందనం’ వర్తించదు. ‘అన్నదాత సుఖీభవ’కు అనర్హులవుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అడ్డంకులు ఎదురవుతాయి. అందుకే ఈ మూడు నెలలు (ఏప్రిల్‌, మే, జూన్‌)లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించవచ్చు. యూనిట్ల వినియోగంలో శ్లాబు మారితే దాని చార్జీ కూడా మారుతుంది. సాధారణంగా 0 నుంచి 30 యూనిట్ల మధ్య ఒక్కో యూనిట్‌కు రూ.3.25, 31 నుంచి 75 యూనిట్ల మధ్య రూ.4, 76 నుంచి 125 యూనిట్ల మధ్య రూ.4.50, 126 నుంచి 225 యూనిట్ల మధ్య రూ.6, 226 నుంచి 400 యూనిట్ల మధ్య రూ.8.75, ఆపై వినియోగిస్తే ఒక్కో యూనిట్‌కు రూ.9 వసూలు చేస్తారు.

తగ్గించుకుంటే మంచిది..

ప్రతి ఇంటా విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రికల్‌ రైస్‌ కుక్కర్లు, ఇంజక్షన్‌ స్టవ్‌లు ఇలా ప్రతిదీ విద్యుత్‌తో ముడిపడినదే. ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని ఫ్యాన్లు. మరోవైపు మితిమీరిన నీటి వినియోగం. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో సైతం ఎక్కువగా విద్యుత్‌ వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వినియోగాన్ని అరికట్టకపోతే మాత్రం విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా వస్తాయి. పైగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉంది. గత అనుభవాల దృష్ట్యా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని విద్యుత్‌ శాఖ అధికారులు కోరుతున్నారు. సూర్యఘర్‌ పథకంలో భాగంగా సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కానీ ప్రజలు అవగాహన పెంచుకోవడం లేదు. ఈ వేసవిలో విద్యుత్‌ వినియోగంలో జాగ్రత్తగా ఉండకపోతే పథకాలకు దూరం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

వినియోగం పెరిగింది..

జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలు వృథాగా విద్యుత్‌ను వినియోగించకూడదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కావొద్దు. గత ఏడాది చాలా మంది పథకాలకు దూరమై విద్యుత్‌ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగారు. అందుకే విద్యుత్‌ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

-పైడి యోగేశ్వరరావు, ఈఈ విద్యుత్‌ శాఖ, శ్రీకాకుళం.

Updated Date - Apr 02 , 2026 | 12:19 AM