Share News

అదే ఆఖరి పరుగు

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:33 AM

Youngman after participating in ‘Agniveer’ rally ఆ యువకుడు.. దేశసేవపై మక్కువతో ఆర్మీ కొలువు సాధించాలనుకున్నాడు. అగ్నివీర్‌ ర్యాలీలో భాగంగా పరుగు పందెం బరిలో దిగాడు. కానీ.. ఆ పరుగు పూర్తికాకుండానే.. అస్వస్థతకు గురై ఊపిరి వదిలాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

అదే ఆఖరి పరుగు
విషాదంలో శేషగిరిరావు కుటుంబ సభ్యులు.. ఇన్‌సెట్‌లో శేషగిరిరావు.ఫైల్‌)

‘అగ్నివీర్‌’ ర్యాలీలో పాల్గొన్న యువకుడి మృతి

పెదంచలలో విషాదం

పలాస రూరల్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆ యువకుడు.. దేశసేవపై మక్కువతో ఆర్మీ కొలువు సాధించాలనుకున్నాడు. అగ్నివీర్‌ ర్యాలీలో భాగంగా పరుగు పందెం బరిలో దిగాడు. కానీ.. ఆ పరుగు పూర్తికాకుండానే.. అస్వస్థతకు గురై ఊపిరి వదిలాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే.. పలాస మండలం పెదంచల గ్రామానికి చెందిన గిన్ని శేషగిరిరావు(19) ఆర్మీలో కొలువు సాధించి దేశ సేవ చేయాలని కలలు కన్నాడు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన అగ్నివీర్‌ ర్యాలీలో పాల్గొన్నాడు. పరుగు పందెం అనంతరం ఒక్కసారిగా గుండె ఆగిపోవడంతో మృతి చెందాడు. ఉదయం పరుగు పందెం పోటీ సమయంలో కుప్పకూలిన శేషగిరిరావును.. వెంటనే ఆర్మీ అధికారులు కేజీహెచ్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారం తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై విశాఖపట్నం మూడోటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దేశ సేవ చేయాలనే ఆశయంతో.....

శేషగిరిరావు తండ్రి కాళిదాసు చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లి బాలమ్మ వ్యవసాయ కూలీ. పెద్దన్నయ్య దివ్యాంగుడు. రెండో అన్నయ్య ఇతర ప్రాంతంలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శేషగిరిరావు ఇంటర్‌ చదివాడు. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనే ఆశయంతో నిత్యం పరుగు, ఇతర దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమయ్యాడు. విశాఖలో నిర్వహించిన ‘అగ్నివీర్‌’ ర్యాలీకి హాజరై.. పరుగు పందెం పోటీల సమయంలో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడంతో తలిదండ్రులు లబోదిబోమంటున్నారు. స్థానికులు విషాదంలో మునిగిపోయారు. వినాయకచవితి వేడుకల్లో సరదాగా గడిపి.. అగ్నివీర్‌ కొలువు కోసం వెళ్లిన.. తమ మిత్రుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం శేషగిరిరావుకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Sep 16 , 2026 | 12:33 AM