Share News

ఆ కబ్జా వాస్తవమే

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:54 PM

Board bungalow occupation ‘నరసన్నపేటలోని బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణ వ్యవహారంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కబ్జా చేసేస్తాం’కథనం నూటికి నూరుపాళ్లు వాస్తవమే. మా కూటమికి చెందిన వ్యక్తులే ఆ ఆస్తిని దోచుకోవడానికి చూస్తున్నార’ని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ కబ్జా వాస్తవమే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

  • బోర్డు బంగ్లా ఆక్రమణకు కూటమి నేతల యత్నం

  • దీనిపై ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదు

  • ఎమ్మెల్యేగా చెబుతున్నా పట్టించుకోరా?..

  • కౌంటర్‌ దాఖలుచేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడండి

  • ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశాలు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనం అక్షర సత్యమని స్పష్టం

  • నరసన్నపేట, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘నరసన్నపేటలోని బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణ వ్యవహారంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కబ్జా చేసేస్తాం’కథనం నూటికి నూరుపాళ్లు వాస్తవమే. మా కూటమికి చెందిన వ్యక్తులే ఆ ఆస్తిని దోచుకోవడానికి చూస్తున్నార’ని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రజాసదన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని తాను ఖండించడం లేదని, అందులో వాస్తవం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారుల వైఖరిపై తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత ప్రభుత్వంలో వైసీపీ వ్యక్తులు ఈ ఆస్తిని దోచుకోవడానికి చూశారు. ప్రస్తుతం కూటమి నేతలు దోచుకోవడానికి యత్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌, ఎంపీడీవో, పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లాను. పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టంగా చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో చలనం లేకపోవడం.. ఎమ్మెల్యేగా నాకు చాలా సిగ్గుగా ఉంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు అందరిపైనా ఉంద’ని ఎమ్మెల్యే రమణమూర్తి తెలిపారు.

  • కోర్టు నుంచి చార్జిషీటు మాయం ...

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసన్నపేటలో పార్కును ధ్వంసం చేసి ఆక్రమించడానికి చూస్తే ప్రజలు అడ్డుకున్నారు. అప్పట్లో పోలీసులు కేసు పెట్టి చార్జిషీటు కూడా వేశారు. అయితే కోర్టు నుంచి ఆ చార్జిషీటు మాయమైపోవడం విస్మయం కలిగిస్తోంది. అప్పటి నుంచి ఆ కేసు అతీగతి లేదని ఎమ్మెల్యే రమణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • తప్పుడు ఆర్డర్లతో..

  • ‘బోర్డు బంగ్లా అనేది మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌కు సంబంధించిన ఆస్తి. కానీ ఆక్రమణదారులు గ్రామపంచాయతీ, తహసీల్దార్‌పై కేసులు వేసి, కోర్టును తప్పుదోవ పట్టించి తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ ఆస్తి పంచాయతీది కానప్పుడు, అసలైన యాజమానులైన జడ్పీ, మండల పరిషత్‌ తరుపున కౌంటర్‌వేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు’ అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మండిపడ్డారు. ఇప్పటికైనా కలెక్టర్‌, ఎంపీడీవో, ఈవోఆర్డీవోలు స్పందించి కౌంటర్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేశారు. బోర్డు బంగ్లా స్థలం చదును చేసే సమయంలో పోలీసు కేసు పెట్టాలన్నారు. కూటమి నాయకులు కబ్జాకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే అయినా... ఒక ఎమ్మెల్యేగా తాను దీనిని ఉపేక్షించేది లేదన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేవరకూ వదిలేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి క్రిష్ణంనాయుడు, నేతింటి విశ్వేశ్వరరావు, అడపా చంద్రశేఖర్‌, జామి వెంకట్రావు, సాసుపల్లి కృష్ణబాబు, గొద్దు చిట్టిబాబు, బలగ ప్రహార్ష పాల్గొన్నారు.

  • ఎంపీడీవోపై ఆగ్రహం

  • నరసన్నపేటలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌పై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మండిపడ్డారు. బోర్డు బంగ్లా ఆస్తి వ్యవహారంపై ఎందుకు కినుక వహిస్తున్నారని.. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 31 , 2026 | 11:54 PM