Share News

ఆ రోజు ఊరంతా పండగే

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:38 AM

We heard on the radio that independence had been achieved స్వాతంత్య్ర ఉద్యమాన్ని కళ్లారా చూసిన వారు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ‘స్వాతంత్య్రం రాక ముందు.. బ్రిటీష్‌ పాలనలో భారతీయులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆంగ్లేయులు మనల్ని బానిసలుగా చూసేవారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీజీ, నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో దేశ నాయకులు పోరాటం చేశారు. చివరకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. చరిత్రలో నిలిచిపోయే ఆ రోజును ఎన్నటికీ మరచిపోలేం. ఆ రోజు ఊరూరా పండుగ చేసుకున్నాం. ర్యాలీలు చేసి ఉద్యమకారులకు జేజేలు పలికాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే అందరికీ సరైన తిండి, బట్టలు దొరికాయి’ అని జిల్లాకు చెందిన పలువురు వృద్ధులు ఆనాటి జ్ఞాపకాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

ఆ రోజు ఊరంతా పండగే
నరసన్నపేటలో గాంధీ బస కోసం 1931లో నిర్మించిన గెస్ట్‌హౌస్‌ కింతలి సత్యనారాయణ, సదాశివుని ప్రభాకర్‌ పట్నాయక్‌, వెలమల నీలమ్మ, హరిహర పాత్రో ః

  • స్వాతంత్య్రం వచ్చినట్లు రేడియోలో విన్నాము

  • ర్యాలీలు చేసి.. ఉద్యమకారులకు జేజేలు పలికాం

  • నాటి స్మృతులను గుర్తుచేసుకున్న అప్పటితరం

  • కంచిలి/ నరసన్నపేట, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమాన్ని కళ్లారా చూసిన వారు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ‘స్వాతంత్య్రం రాక ముందు.. బ్రిటీష్‌ పాలనలో భారతీయులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆంగ్లేయులు మనల్ని బానిసలుగా చూసేవారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీజీ, నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో దేశ నాయకులు పోరాటం చేశారు. చివరకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. చరిత్రలో నిలిచిపోయే ఆ రోజును ఎన్నటికీ మరచిపోలేం. ఆ రోజు ఊరూరా పండుగ చేసుకున్నాం. ర్యాలీలు చేసి ఉద్యమకారులకు జేజేలు పలికాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే అందరికీ సరైన తిండి, బట్టలు దొరికాయి’ అని జిల్లాకు చెందిన పలువురు వృద్ధులు ఆనాటి జ్ఞాపకాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

  • ఆ సమాచారం రేడియోలో విన్నాం

  • ‘అప్పట్లో పంట గింజలు ఇంటికి తెచ్చుకోవడానికి కష్టం. ఒంటినిండా కప్పుకోవడానికి గుడ్డముక్క సైతం లేని పరిస్థితులు ఎదుర్కొన్నాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సమాచారం రేడియోలో విన్నాం. ఇంటి నుంచి బయటకు వచ్చి ఆనందంతో గెంతులేశామ’ని కంచిలి మండలం డోళగోవిందపురానికి చెందిన 96 ఏళ్ల హరిహరపాత్రో తెలిపారు. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాకు 16 ఏళ్లు. అప్పట్లో ఎనిమిదో తరగతి చదివాను. స్వాతంత్య్రం రాక ముందు మా ప్రాంతానికి పోలీసులు వచ్చి.. ఎకరాకు రూ.5 చొప్పున శిస్తు వసూలు చేయించేవారు. ఇవ్వకపోతే కొరడాలు, లాఠీలతో కొట్టేవారు. బ్రిటీష్‌ వాళ్లు జపాన్‌తో యుద్ధం చేసే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి ఆహార పదార్థాలన్నీ తీసుకెళ్లిపోయారు. వండుతున్న అంబలిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ పోలీసుపై ఓ మహిళ తిరగబడింది. దీంతో ఆ పోలీసు వెనుదిరిగాడు. బారువకి చెందిన గౌతు లచ్చన్న ప్రజలకు అండగా.. బ్రిటీష్‌ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని మా పెద్దల ద్వారా విన్నాం. ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రం వచ్చాకే కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి గుడ్డ దొరికాయి. స్వాతంత్య్రం వచ్చిన చాలా ఏళ్ల తర్వాత కొత్త పద్ధతులు వచ్చాయ’ని హరిహరపాత్రో తెలిపారు.

  • జమీందారులదే పెత్తనం

  • మాకు తెలిసీ తెలియని వయసులో ఈ ప్రాంతమంతా జమీందారుల ఆధీనంలో ఉండేదని నరసన్నపేటకు చెందిన కింతలి సత్యనారాయణ(రిటైర్డ్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు) తెలిపారు. ‘బ్రిటీష్‌ పాలకులు ఏడాదికోసారి కప్పం వసూలు చేసేవారు. నరసన్నపేట పరిసరాల్లోని ఉర్లాం, దేవాది, ప్రియాగ్రహారం తదితర ప్రాంతాల్లో జమీందారీ సంస్థానాల ఆధీనంలో భూములు ఉండేవి. ఆయా గ్రామాల్లో రైతులకు ఎటువంటి సాగుహక్కులు ఉండేవి కావు. పంటలు పండినా.. పండకపోయినా రైతుల నుంచి జమీందారులు కఠినంగా శిస్తు వసూలు చేసేవారు. మన దేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థను రద్దు చేశార’ని సత్యనారాయణ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన రోజు.. అంతటా పండుగ వాతావరణం కనిపించిందన్నారు.

  • కఠినంగా శిస్తు వసూలు

  • స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్‌ పాలనలో కఠినంగా శిస్తు వసూలు చేసేవారని నరసన్నపేటకు చెందిన సదాశివుని ప్రభాకర్‌ పట్నాయక్‌ (రిటైర్డ్‌ తహసీల్దార్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు) తెలిపారు. ‘సిక్కోలు ప్రాంతం గంజాం జిల్లా పరిధిలో ఉండేది. విశాఖపట్నం వరకు కూడా గంజాం జిల్లా విస్తరించి ఉండేది. ఈప్రాంతంలో కొన్ని ప్రాంతాలను సంస్థానదీశులు పాలించారు. ముఖ్యంగా విజయనగరం, పర్లాకిమిడి కేంద్రంగా పాలించేవారు. నేటి జిల్లాలో కొంత ప్రాంతం సర్కారు పాలనలో ఉండేది. గ్రామస్థాయిలో మునసబుకే సర్వాధికారులు ఉండేవి. రైతులు నుంచి కఠినంగా శిస్తు వసూలు చేసేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు మునసబులే శిస్తు వసూలు చేసి సర్కారుకు జమ చేసేవార’ని ప్రభాకర్‌ పట్నాయక్‌ తెలిపారు.

  • బ్రిటీష్‌ పోలీసులను చూసి..

  • ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పెద్దలు చెబితే విన్నాం. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనలేదు. గ్రామానికి అప్పుడప్పుడూ ఎవరో వచ్చి స్వాతంత్య్రం కోసం చెబుతుండేవారు. బ్రిటీష్‌ పోలీసులను చూసి హడలెత్తిపోయేవాళ్లమ’ని జమ్ము గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు వెలమల నీలమ్మ తెలిపారు. ‘అప్పట్లో పెద్దగా చదువులు ఉండేవి కాదు. చిన్నప్పటి నుంచి కుటుంబం గడవడానికే కష్టపడేవాళ్లం. ఉప్పుసత్యాగ్రహంలో భాగంగా 1931లో మహాత్మా గాంధీజీ నరసన్నపేట వస్తారని.. పొట్నూరు స్వామిబాబు ఆయన కోసం సోమవారం సంత వద్ద గెస్ట్‌హౌస్‌ను కట్టించారు. అయితే గాంధీగారు నరసన్నపేట రాకుండా సారవకోట వెళ్లారు. అక్కడ బస చేశారు. ఆ భవనంలో కొన్నాళ్లు గ్రంథాలయం నిర్వహించారు. ఆ రోజుల్లో బ్రిటీష్‌ వాళ్లకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టేవారు. జమీలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడితే భూములు తీసుకుంటారనే భయంతో రైతులు నిరసనలో పాల్గొనేవారు కాదు’ అని నీలమ్మ తెలిపారు.

Updated Date - Aug 15 , 2026 | 12:38 AM