Share News

మరింత మందికి ‘తల్లికి వందనం’

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:15 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవా రం సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

 మరింత మందికి ‘తల్లికి వందనం’

- ఆశా వర్కర్లకు రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ

- హాస్టళ్ల విద్యార్థుల డైట్‌ చార్జీలు 10 శాతం పెంపు

- 45 రోజుల్లో ఇళ్ల స్థలాల సమస్యలకు చెక్‌

- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

శ్రీకాకుళం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవా రం సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆశా వర్కర్లకు, పేద విద్యార్థులకు, అన్నదాతలకు, సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ఊరటనిచ్చేలా ప్రకటనలు చేసింది. తల్లికి వందనం పథకాన్ని మరింత మందికి అందించాలని, ఉద్యాన రైతులకు ‘స్మార్ట్‌’ సేవలు మెరుగుపరచాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఎంతోమందికి లబ్ధి చేకూరనుంది.

- పేద విద్యార్థుల చదువులకు కొండంత అండగా నిలుస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పరిధిలోకి జిల్లా నుంచి మరింత మంది చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 58,601 మంది విద్యార్థులను ఈ పథకం కిందకు తీసుకువస్తూ ఇచ్చిన పరిపాలనా అనుమతులను కేబినెట్‌ ర్యాటిఫై చేసింది. ఈ నిర్ణయంతో... తొలి విడతలో సాంకేతిక కారణాలతో పథకం అందని జిల్లాలోని అర్హులైన విద్యార్థులకు రెండో దశలో లబ్ధి చేకూరనుంది.

- విధుల్లో ఉండగా మరణించే ఆశా కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, ప్రతి ఏడాది సర్వీసుకు రూ.5 వేలు చొప్పున గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ (ఎండ్‌-ఆఫ్‌-సర్వీస్‌ ప్రయోజనం) చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని వేలాది మంది ఆశా వర్కర్ల కుటుంబాలకు భరోసా దక్కనుంది.

- జిల్లాలోని సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు డైట్‌ చార్జీలను పది శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

- మామిడి, జీడి, కొబ్బరి తదితర ఉద్యాన పంటలకు పెట్టింది పేరైన జిల్లా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉద్యాన పంటల సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించేందుకు ఆధునిక సాంకేతికతో ‘ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. దీని ద్వారా జిల్లాలోని రైతులకు సకాలంలో సలహాలు, వాతావరణ సమాచారం అందుతాయి.

- జిల్లాలో ఇళ్ల స్థలాల సమస్యలతో సతమతమవుతున్న వారికి సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ 45 రోజుల్లో పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్ధిదారులు వద్దనుకుని వదిలేసిన స్థలాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి.. జిల్లాలోని నిజమైన అర్హులకు వాటిని తిరిగి కేటాయించే ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. అలాగే, కొత్తగా ఇళ్ల స్థలాలు కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి భూసేకరణ ఎలా చేయాలన్న దానిపై కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Updated Date - Oct 08 , 2026 | 12:15 AM