35వేల మందికి తల్లికి వందనం
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:35 AM
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించే తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వ ఉత్తర్వులు
తొలివిడతలో సాయం అందని అర్హులతో పాటు కొత్తవారికి అవకాశం
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): పేద, మధ్యతరగతి కుటుంబాల్లో విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించే తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో సాంకేతిక కారణాలతో సాయం అందని అర్హులతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ నగదు జమ చేయనున్నారు. జిల్లాలో సుమారు 35వేల మంది ఈ విడతలో లబ్ధి పొందనున్నారు.
కొత్త విద్యార్థులకూ అవకాశం
విద్యాహక్కు చట్టం కింద పైవ్రేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన సుమారు 2,200 మంది విద్యార్థులతో పాటు, వివిధ సాంకేతిక కారణాలతో తొలి విడతలో సాయం అందని మరో 2,300 మంది విద్యార్థులు పథకానికి దూరమయ్యారు. అర్హులందరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం స్వీకరించిన ఫిర్యాదులను సమగ్రశిక్ష అధికారులు పరిశీలించారు. అర్హులైన విద్యార్థుల జాబితాను ఆగస్టులో ప్రభుత్వానికి పంపించారు. ఈ జాబితాలను సచివాలయాలకు పంపించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 18,254 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సుమారు 23వేల మంది చేరారు. వీరిలో సుమారు 30వేల మంది పథకానికి అర్హులుగా గుర్తించారు. తొలి విడతలో సాయం అందని వారితో పాటు కొత్తగా అర్హత పొందిన వారికి కలిపి సుమారు 35 వేల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తొలి విడతలో జిల్లాలో 2,54,153 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పు జమ చేశారు.